Half Days: సమ్మర్ ఎఫెక్ట్... పంజాబ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఒంటిపూట విధులు
- దేశవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు
- పంజాబ్ లోనూ ముదురుతున్న ఎండలు
- పాఠశాల విద్యార్థుల తరహాలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒంటిపూట విధులు
- ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విధులు
- మే 2 నుంచి జులై 15 వరకు అమలు
వేసవిలో ఎండలు ముదిరితే విద్యార్థులకు ఒంటిపూట బడులు పెట్టడం సాధారణమైన విషయం. కానీ, భానుడి భగభగలను దృష్టిలో ఉంచుకుని పంజాబ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఒంటిపూట విధులు ప్రకటించారు.
వేసవి తాపం నుంచి ఉద్యోగులు ఉపశమనం పొందేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిపుణులతో చర్చించిన అనంతరం సీఎం భగవంత్ మాన్ కార్యాలయం ఓ ప్రకటన చేసింది.
మామూలుగా అయితే, పంజాబ్ లో ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎండ దెబ్బ నేపథ్యంలో, ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విధులు నిర్వర్తించాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మే 2వ తేదీ నుంచి ఈ ఒంటిపూట విధులు అమల్లోకి వస్తాయి. జులై 15 వరకు ఇదే విధానం కొనసాగుతుందని సీఎం భగవంత్ మాన్ వెల్లడించారు.