MS Dhoni: అందుకే ధోనీ రివ్యూ సిస్టమ్ అనేది.. రివ్యూలో మహీ రాక్స్.. అంపైర్ షాక్!
- ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో హైలైట్ గా డీఆర్ఎస్
- సూర్య కుమార్ క్యాచ్ పట్టి రివ్యూ కోరిన ధోనీ
- నిర్ణయాన్ని మార్చుకున్న ఫీల్డ్ అంపైర్
భారత దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ ఎలా ఉంటుందో అభిమానులందరికీ తెలుసు. క్రికెట్ లో చాలా మందికి అంతచిక్కని డీఆర్ఎస్‌ను అలవోకగా వినియోగించుకొని ఫలితం రాబట్టడంలో మహీ ముందు వరుసలో ఉంటాడు. ఒకవేళ ధోనీ అడిగితే అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడం చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. అందుకే డీఆర్‌ఎస్‌కు ఫ్యాన్స్ ధోనీ రివ్యూ సిస్టమ్ అనే పేరు పెట్టారు. ముంబై ఇండియన్స్‌తో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో ధోనీ రివ్యూ సిస్టమ్ ను ఫ్యాన్స్ చూశారు. తన మాస్టర్ మైండ్ తో సూర్యకుమార్ యాదవ్‌ను ఇదే తరహాలో మహీ పెవిలియన్‌కు పంపించాడు.
ముంబై ఇన్నింగ్స్ 8వ ఓవర్లో సూర్యకుమార్ బ్యాటింగ్ చేస్తుండగా శాంట్నర్ వేసిన బంతి లెగ్ సైడ్ వైపు వెళుతూ అతడి గ్లౌస్‌ను చిన్నగా తాకింది. ధోనీ ఆ బంతిని రెప్ప పాటులో అందుకుని అప్పీల్ చేశాడు. అయితే అంపైర్ మాత్రం ఔట్ ఇవ్వకుండా దాన్ని వైడ్ బాల్ గా ప్రకటించాడు. దీంతో వెంటనే ధోనీ డీఆర్‌ఎస్ అడిగాడు. రీప్లేలో ఆ బంతి సూర్య గ్లౌస్‌కు తగిలినట్టు కనబడింది. దీంతో సూర్య పెవిలియన్‌కు చేరగా.. మ్యాచ్ చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ధోనీ డీఆర్ఎస్ కోరిన వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది. దీనిపై రకరకాల మీమ్స్ వస్తున్నాయి.