KTR: ఒక్క రాష్ట్రం పేరైనా చెప్పాలంటూ మోదీకి కేటీఆర్ ఛాలెంజ్

KTR challenges to Modi over Stat performence

  • నిన్న పరేడ్ గ్రౌండ్ లో మోదీ ప్రసంగానికి కేటీఆర్ కౌంటర్
  • 9 ఏళ్లలో తెలంగాణ కంటే మెరుగైన వృద్ధి సాధించిన  రాష్ట్రం పేరు చెప్పాలని సవాల్
  • తెలంగాణ ప్రగతిని వివరిస్తూ ట్వీట్ చేసిన కేటీఆర్

హైదరాబాద్ వేదికగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు సంధించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఐటీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. రాజకీయాల కోసమే ప్రధాని మోదీ హైదరాబాద్‌ వచ్చారని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణలా అభివృద్ధి సాధించిన రాష్ట్రాన్ని చూపించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ముందంజలో ఉన్న రంగాలను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక పాలసీ కలిగిన రాష్ట్రం తెలంగాణ అని, దేశ జీడీపీ వృద్ధికి తోడ్పడుతున్న రాష్ట్రాల్లో నాలుగో స్థానంలో ఉన్నదన్నారు. 

‘దేశంలోని అత్యధిక తలసరి వృద్ధి కలిగిన రాష్ట్రం తెలంగాణ. ఇంటింటికీ తాగునీరు అందించిన మొదటి రాష్ట్రం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును పూర్తి చేసిన రాష్ట్రం మాది. వంద శాతానికిపైగా ఓడీఎఫ్ గ్రామాలు ఉన్న రాష్ట్రం. దేశంలో రెండో అత్యధిక వరి ఉత్పత్తిదారు, అత్యధిక ఐటీ ఉద్యోగాలు సృష్టించే రాష్ట్రం మాది. భారత జీడీపీకి తోడ్పడే టాప్ 4 రాష్ట్రాల్లో ఒకటి. అత్యుత్తమ పారిశ్రామిక విధానం, అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్ (కేఎంపీటీ) ఉన్న రాష్ట్రం. దేశంలో అత్యధిక తలసరి విద్యుత్ వినియోగించే, ఎన్నో అంతర్జాతీయ ప్రశంసలు పొందిన రాష్ట్రం తెలంగాణ’ అంటూ ట్వీట్ చేశారు. 

ఇంత అభివృద్ధిలో ఉన్న రాష్ట్రం గురించి ప్రధాని ఒక్క మాట కూడా మెచ్చుకోలేదని విమర్శించారు. చిల్లర రాజకీయాల కోసం  రాష్ట్ర అభివృద్ధిని అంగీకరించడానికి నిరాకరించారని దుయ్యబట్టారు. ‘నరేంద్ర మోదీ గారు, గత 9 ఏళ్లలో తెలంగాణ కంటే మెరుగైన పనితీరు కనబరిచిన రాష్ట్రం పేరు చెప్పమని నేను మిమ్మల్ని సవాలు చేస్తున్నాను?’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News