Kommalapati Sridhar: అమరావతిలో సవాళ్లు, ప్రతి సవాళ్లు.. టీడీపీ నేత కొమ్మాలపాటి శ్రీధర్ అరెస్టు
- పెదకూరపాడు ఎమ్మెల్యే శంకరరావు, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ మధ్య మాటల యుద్ధం
- అవినీతి ఆరోపణలు, అభివృద్ధిపై అమరలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రమాణం చేస్తామన్న నేతలు
- గుడి దగ్గరికి భారీగా చేరుకున్న టీడీపీ, వైసీపీ శ్రేణులు
- కొమ్మాలపాటి శ్రీధర్ ను అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు.. టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్
అమరావతిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెదకూరపాడు నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలపై స్థానిక వైసీపీ ఎమ్మెల్యే నంబూరి శంకరరావు, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడిచాయి. నేతలిద్దరూ ఆదివారం అమరావతిలోని అమరలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రమాణం చేస్తామని ప్రకటించడం ఉద్రిక్తతలకు దారి తీసింది.
ఈ నేపథ్యంలో ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న కొమ్మాలపాటి శ్రీధర్ ను పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి వాహనంలో ఆయన్ను తరలించారు. ఈ సమయంలో వాహనాన్ని అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు.
ఈ రోజు టీడీపీ నేత కొమ్మాలపాటి శ్రీధర్ పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి స్థానిక అమరలింగేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నారు. దీంతో పోలీసులు శ్రీధర్‌ను అడ్డుకున్నారు. ఆయన్ను అదుపులోకి తీసుకుని.. టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై కొమ్మాలపాటి మండిపడ్డారు. పోలీసు వాహనంలో నుంచి మీడియాతో ఆయన మాట్లాడారు.
అమరావతిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, దీనిపై తాను ఎప్పుడైనా చర్చకు సిద్ధమని శ్రీధర్ తేల్చిచెప్పారు. నదిలో తవ్విన గోతుల వల్లే అనేక మంది చనిపోతున్నారని ఆరోపించారు. ఇసుక దోపిడీ, మట్టి మాఫియా, ఇళ్ల నిర్మాణంపై చర్చకు రెడీ అని, వైసీపీ హయాంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని, దీనిపై ఆధారాలతో వచ్చామని శ్రీధర్ స్పష్టం చేశారు. కానీ పోలీసులతో అడ్డుకుని, అరెస్టు చేయించారని ఆరోపించారు. దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం తప్పితే రాష్ట్రప్రభుత్వం చేసిందేమీ లేదని మండిపడ్డారు.
అంతకుముందే ఆలయం వద్దకు ఎమ్మెల్యే శంకరరావు చేరుకున్నారు. తాను కూడా ఆధారాలతో వచ్చానని, ఏ తప్పు చేయలేదని చెప్పారు. టీడీపీ వాళ్లు ప్రమాణం చేస్తే.. తానూ చేస్తానని అన్నారు. అప్పటిదాకా ఆలయం వద్దే ఉంటానన్నారు. ఎమ్మెల్యేకు మద్దతుగా వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. కొమ్మాలపాటి శ్రీధర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి, నినాదాలు చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో అమరేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే దారిని పోలీసులు మూసివేశారు. ఆలయ సరిసరాల్లో 144 సెక్షన్ విధించి భారీగా పోలీసులను మోహరించారు.