ipl 2023: రెండు ఓటములతోనే అంతా అయిపోలేదు: రోహిత్ శర్మ
- ముంబై ఇండియన్స్ వరుస ఓటములపై స్పందించిన రోహిత్
- సీనియర్లు బాధ్యతతో ఆడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య
- ఒక్కసారి గెలుపు ట్రాక్ ఎక్కితే తర్వాత కష్టమనిపించదని వెల్లడి
వరుసగా రెండు ఓటములను ముంబై ఇండియన్స్ చవిచూసింది. సీనియర్లు రాణించకపోవడం, టీ20 స్పెషలిస్టు ఆటగాళ్లు సూర్యకుమార్, ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్ పెద్దగా ఆకట్టుకోపోవడంతో ఇంకా గెలుపు రుచి చూడనేలేదు. ఈ నేపథ్యంలో తమ బ్యాటింగ్ పై వస్తున్న విమర్శలపై రోహిత్ శర్మ స్పందించాడు.
సీనియర్ ఆటగాళ్లు బాధ్యతతో ఆడాల్సిన అవసరం ఉందని, అది ముందు తనతోనే మొదలవ్వాలని రోహిత్ అన్నాడు. ఒక్కసారి గెలుపు ట్రాక్ ఎక్కితే.. తర్వాత కష్టమనిపించదని చెప్పుకొచ్చాడు. చాలా విషయాల్లో మార్పులు చేయాల్సి ఉందని, దూకుడుగా ఆడాలని తెలిపాడు.
‘‘జట్టులో యువ ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లు బాగా ఆడాలంటే సమయం అవసరం. వారిపై నమ్మకం ఉంచి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. రెండు మ్యాచుల్లో ఓడిపోగానే అంతా అయిపోలేదు. సీనియర్లు బ్యాటింగ్ లో రాణించాలి. దీన్ని నా నుంచే మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది’’ అని రోహిత్ వివరించాడు.
కొన్ని విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో దాదాపు 40 పరుగులు వెనుకబడిపోయామని, మిడిల్ ఓవర్లలో సరిగ్గా ఆడలేదని వివరించాడు. మరో 30 నుంచి 40 పరుగులు ఎక్కువ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.