Zahirabad: గుర్తింపులేకున్నా అడ్మిషన్లు.. జహీరాబాద్ లో పరీక్షలకు దూరమైన పదో తరగతి విద్యార్థులు

Zahirabad 10th Class Students Life Dilemma Over a Private School not Having Govt Permission for Class 10th Medak
  • ఆక్స్ ఫర్డ్ ప్రైవేట్ పాఠశాల నిర్వాకం
  • పరీక్షలు మొదలై నాలుగు రోజులైనా ఇప్పటికీ అందని హాల్ టికెట్లు
  • పోలీసులను ఆశ్రయించిన విద్యార్థుల తల్లిదండ్రులు
సంగారెడ్డి జిల్లాలోని ఓ పాఠశాల యాజమాన్యం నిర్వాకంతో పదోతరగతి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థుల నుంచి ముక్కుపిండి పరీక్ష ఫీజు వసూలు చేసిన యాజమాన్యం.. పరీక్షలు మొదలై నాలుగు రోజులైనా ఇప్పటికీ హాల్ టికెట్లు ఇవ్వలేదు. ఇదేంటని ఆరా తీయగా.. అసలా స్కూలుకు ప్రభుత్వ గుర్తింపే లేదని తేలడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

జిల్లాలోని జహీరాబాద్ లో ఆక్స్ ఫర్డ్ స్కూల్ కు కేవలం ఎనిమిదో తరగతి వరకే ప్రభుత్వ గుర్తింపు ఉంది. అయితే, యాజమాన్యం ఈ విషయాన్ని దాచి పదో తరగతిలో కూడా పిల్లలను చేర్చుకున్నారు. ఎనిమిది మంది విద్యార్థులు ఈ స్కూల్ లో పదో తరగతి చదువుతున్నారు. ఇటీవల పరీక్ష ఫీజు కూడా వసూలు చేసిన యాజమాన్యం హాల్ టికెట్లు మాత్రం ఇప్పటికీ ఇవ్వలేదు. దీంతో ఆ ఎనిమిది మంది విద్యార్థులు ఒక్క పరీక్ష కూడా రాయలేదు.

విద్యార్థులు, తల్లిదండ్రులు నిలదీయడంతో ప్రత్యేక అనుమతితో పరీక్షలు రాయిస్తానంటూ ప్రిన్సిపాల్ వారిని బుకాయించాడు. స్కూలుకు ఎనిమిదో తరగతి వరకే అనుమతి ఉందని బయటపడడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కాగా, ఆక్స్ ఫర్డ్ స్కూలు యాజమాన్యం నిర్వాకంతో ఎనిమిది మంది విద్యార్థులు ఈ ఏడాది కోల్పోవాల్సి వచ్చిందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పరీక్షలు ప్రారంభం కావడంతో ఆ ఎనిమిది మంది పబ్లిక్ పరీక్షలు రాసే అవకాశం లేదని స్పష్టం చేశారు.
Zahirabad
10th students
public exams
acadamic year
private school

More Telugu News