Rahul Tripathi: పంజాబ్ కింగ్స్ ను ఉతికారేసిన త్రిపాఠి... సన్ రైజర్స్ గెలుపు బోణీ

Rahul Tripathi hammers Punjab Kings as SRH registered first victory in IPL 16

  • తొలి రెండు మ్యాచ్ ల్లో ఓడిన సన్ రైజర్స్
  • పంజాబ్ కింగ్స్ తో అమీతుమీ మ్యాచ్
  • 8 వికెట్ల తేడాతో ఘనంగా నెగ్గిన సన్ రైజర్స్
  • 144 రన్స్ లక్ష్యఛేదనను 17.1 ఓవర్లలో ముగించిన హైదరాబాద్
  • 48 బంతుల్లో 74 పరుగులు చేసిన త్రిపాఠి

ఐపీఎల్-16లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. తొలి రెండు మ్యాచ్ ల్లో ఓటమిపాలైన సన్ రైజర్స్... పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఘనంగా గెలిచింది. సన్ రైజర్స్ విజయంలో రాహుల్ త్రిపాఠి అర్ధసెంచరీతో ప్రధానపాత్ర పోషించాడు. 

వన్ డౌన్ లో వచ్చిన త్రిపాఠి పంజాబ్ బౌలింగ్ ను ఊచకోత కోశాడు. స్పిన్, పేస్ అనే తేడా లేకుండా... బంతి కనిపిస్తే చాలు బాదేశాడు. త్రిపాఠి 48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులతో 74 పరుగులు సాధించాడు. అతడికి కెప్టెన్ మార్ క్రమ్ కూడా జత కలిశాడు. ఈ జోడీ మరో వికెట్ పడకుండా జట్టును గెలుపుతీరాలకు చేర్చింది. మార్ క్రమ్ 21 బంతుల్లో 6 ఫోర్లతో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

144 పరుగుల లక్ష్యఛేదనను సన్ రైజర్స్ జట్టు 17.1 ఓవర్లలో ముగించింది. ఈ క్రమంలో కేవలం 2 వికెట్లు కోల్పోయింది. 

తొలి రెండు మ్యాచ్ లలో విఫలమైన హ్యారీ బ్రూక్ ను ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలో దించారు. కానీ భారీ స్కోరు సాధించడంలో విఫలమయ్యాడు. బ్రూక్ 13 పరుగులు చేసి అర్షదీప్ సింగ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 21 పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్షదీప్ 1, రాహుల్ చహర్ 1 వికెట్ తీశారు. 

అంతకుముందు, సన్ రైజర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులు చేసింది. పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ 99 (నాటౌట్) పరుగులు సాధించాడు. సన్ రైజర్స్ లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే 4 వికెట్లతో సత్తా చాటాడు.

  • Loading...

More Telugu News