Somu Veerraju: ఏపీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రికి సోము వీర్రాజు ఫిర్యాదు
- కేంద్రం 32 లక్షల ఇళ్లను మంజూరు చేస్తే 32 వేల ఇళ్లనే కట్టారన్న వీర్రాజు
- ఈ ఇళ్లకు వైసీపీ రంగులు పూస్తున్నారని విమర్శ
- ఏపీకి వచ్చి పరిస్థితిని చూడాలని కేంద్ర మంత్రికి విన్నపం
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై ఆయన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి ఫిర్యాదు చేశారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం 32 లక్షల ఇళ్లను మంజూరు చేస్తే ఇప్పటివరకు 32 వేల ఇళ్లు మాత్రమే కట్టారని కేంద్ర మంత్రికి ఆయన చెప్పారు. ఇళ్ల నిర్మాణాల్లో అలసత్వం చోటుచేసుకుంటోందని, పొరపాట్లు జరుగుతున్నాయని తెలిపారు.
కేంద్ర నిధులతో కట్టిన ఇళ్లకు వైసీపీ రంగులు పూస్తున్నారని వీర్రాజు ఆరోపించారు. ఇళ్లకు పీఎం ఆవాస్ యోజన బోర్డు లేదని తెలిపారు. ఒకసారి ఏపీకి వచ్చి పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని కోరారు. సర్పంచ్ ల ఖాతాల్లోని డబ్బులను కూడా ప్రభుత్వ ఖాతాల్లోకి మళ్లిస్తున్నారని చెప్పారు. సోము వీర్రాజు మరో మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పొత్తులపై ఆయన చర్చించినట్టు సమాచారం. ఆ నేపథ్యంలో, వీర్రాజు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.