Maharashtra: షెడ్డుపై పురాతన చెట్టు కూలి ఏడుగురి మృత్యువాత.. 30 మందికి గాయాలు
- మహారాష్ట్రలోని అకోలాలో ఘటన
- చెట్టుకూలిన సమయంలో షెడ్డులో 40 మంది
- మరొకరి పరిస్థితి విషమం
- బాధితులకు ఆర్థిక సాయం అందించాలని సీఎం నిర్ణయం
పురాతన చెట్టు కూలిన ఘటనలో ఏడుగురు మృతి చెందగా మరో 30 మంది వరకు గాయాలపాలయ్యారు. మహారాష్ట్రలోని అకోలాలో జరిగిందీ ఘటన. ఓ చిన్నపాటి షెడ్డుపై చెట్టు కూలిందని, ఆ సమయంలో అందులో దాదాపు 40 మంది ఉన్నారని అకోలా కలెక్టర్ నిమా అరోరా తెలిపారు.
మొత్తం 36 మందిని ఆసుపత్రికి తరలించగా వారిలో నలుగురు అప్పటికే మృతి చెందినట్టు చెప్పారు. ఆ తర్వాత మృతుల సంఖ్య ఏడుకు పెరిగిందని తెలిపారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. అకోలాలోని పరాస్‌లో కొందరు భక్తులు మతపరమైన వేడుక కోసం అక్కడకు చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. చెట్టు కూలి భక్తులు చనిపోవడం తనను బాధించిందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్, ఎస్పీ క్షతగాత్రులకు సకాలంలో చికిత్స అందేలా చూశారు. బాధితులకు ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నిర్ణయించారు.