Tamilisai Soundararajan: మూడు పెండింగ్ బిల్లులకు ఆమోదం తెలిపిన గవర్నర్ తమిళిసై
- గవర్నర్ తమిళిసై వద్ద పెండింగ్‌లో శాసనసభ ఆమోదం పొందిన బిల్లులు
- తమిళిసై పరిశీలనలో మొత్తం 10 బిల్లులు
- బిల్లులకు ఆమోదముద్రం వేయడంలో జాప్యం జరుగుతోందంటూ సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వ పిటిషన్
- పిటిషన్‌పై నేడు విచారణ
- ఇంతలోనే మూడు బిల్లులపై గవర్నర్ ఆమోదముద్ర
- రెండు బిల్లులు రాష్ట్రపతి పరిశీలనకు, మరో రెండు ప్రభుత్వానికి తిప్పి పంపించిన గవర్నర్
గవర్నర్ తమిళిసై బిల్లులకు ఆమోదం తెలపట్లేదంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం సంభవించింది. ప్రభుత్వం పంపిన బిల్లుల్లో మూడింటికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తాజాగా ఆమోదం తెలిపారు. మరో రెండు బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన గవర్నర్..ఇంకో రెండు బిల్లులను ప్రభుత్వానికి తిప్పి పంపించారు. గవర్నర్ వద్ద మొత్తం 10 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక ఏ బిల్లులకు గవర్నర్ ఆమెదముద్ర వేశారో? వేటిని తిప్పి పంపించారో తేలాల్సి ఉంది.
ప్రభుత్వ బిల్లులు గవర్నర్ పెండింగ్‌లో ఉంచడంపై కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. బిల్లులపై ఆమోదముద్ర వేయడంలో అనవసర తాత్సారం చేస్తున్నారంటూ కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారు. గతేడాది రాష్ట్రశాసన సభ ఆమోందించిన పది బిల్లులకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటానికి సిద్ధమైంది. ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శాంతి కుమారి రిట్ పిటిషన్ వేశారు. ఇందులో ప్రతివాదిగా గవర్నర్‌ను చేర్చారు. ఈ పిటిషన్‌పై సుప్రీం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నదానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొనగా గవర్నర్ తాజా నిర్ణయంతో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది.
పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఇవే..
వర్సిటీల్లో నియామకాలు చేపట్టేందుకు ఉమ్మడి బోర్డు ఏర్పాటు, సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థ తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మార్పు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతిచ్చేలా ప్రైవేటు విశ్వవిద్యాలయ చట్ట సవరణ. జీహెచ్ఎంసీ, పురపాలక చట్టాలకు సవరణ, పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ చట్టం, అజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్టం, జీఎస్టీ చట్టాలను సవరిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులకు శాసనసభ ఆమోదం దక్కినా గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండిపోయాయి.