Posani Krishna Murali: పృథ్వీ ఆరోపణలకు భయపడి.. రాఘవేంద్రరావు నాకు ఫోన్ చేశారు: పోసాని కృష్ణ మురళి
- రాఘవేంద్రరావు తనతో పని చేయించుకుంటారని, తననే విలన్ లా చూస్తారన్న పోసాని
- పృథ్వీ వైసీపీలో ఉన్నప్పుడు తిట్టి.. పార్టీ నుంచి బయటికొచ్చాక వేషం ఇచ్చారని వెల్లడి
- ఎవడు తొక్కినా తాను వంగనని స్పష్టీకరణ
- రాఘవేంద్రరావు లాంటి వాళ్లకు జగన్‌పై పీకల దాకా కోపం ఉందని వ్యాఖ్య
సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావుపై ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన తనతో పని చేయించుకుంటారని, కానీ తనను విలన్ మాదిరి చూస్తారని ఆరోపించారు. ఈ మేరకు ఓ తెలుగు న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోసాని పలు వ్యాఖ్యలు చేశారు.
‘‘రాఘవేంద్రరావు పెద్ద డైరెక్టర్. ఆయనకు నేనంటే చాలా ఇష్టం. వైసీపీ గెలిచిన తర్వాత పృథ్వీ ఎస్‌వీబీసీ చైర్మన్ అయ్యారు. అప్పుడు..‘రాఘవేంద్రరావు అవినీతి పనులు చేశాడు. దాన్ని నేను కక్కిస్తాను’ అని పృథ్వీ అన్నాడట. ఆయనేమన్నాడో నాకు తెలియదు. పృథ్వీ ఆరోపణలకు భయపడి.. రాఘవేంద్రరావు నాకు ఫోన్ చేశారు. ‘ఏం మురళి.. నేనేదో అవినీతి చేశానంట. పృథ్వీ అంటున్నాడు’ అని చెప్పారు. దీంతో నేను.. ‘సార్ మీరు లంచాలు తిన్నారో లేదో పొద్దునే ఎందుకు అవన్నీ.. నేను చెబుతాలెండి’ అన్నాను’’ అని పోసాని వివరించారు.
‘‘పృథ్వీకి నేను ఫోన్ చేసి ‘పెద్దాయన జెంటిల్‌మేన్. చిన్న చిన్న వాటికి ఆశపడడులే’ అని అన్నాను. తర్వాత రాఘవేంద్రరావు ఫోన్ చేసి థాంక్స్ చెప్పారు. ఎస్‌వీబీసీ చైర్మన్ పదవి నుంచి పృథ్వీ దిగిపోయినప్పుడు మళ్లీ నాకు రాఘవేంద్రరావు ఫోన్ చేసి ‘హ హ హ.. మురళి’ అంటూ నవ్వారు. కానీ తర్వాత ఆయనే పృథ్వీని పిలిచి వేషమిచ్చాడు. పృథ్వీ వైసీపీలో లేడుగా మరి. నేను ఇంకా వైసీపీలో ఉన్నానుగా. నాతో పని చేయించుకుంటాడు. కానీ నన్నో విలన్‌లాగా చూస్తాడు’’ అని విమర్శలు చేశారు.
‘‘ఓ సారి రాఘవేంద్ర రావు నాతో మాట్లాడుతూ.. ‘రావణాసురుడు కోసం అతని కొడుకు మేఘనాథుడు చచ్చిపోయాడు. అలా నువ్వు కూడా ఈ రావణాసురుడు (జగన్) కోసం చచ్చిపోతావా.. హ హ హ’ అని నవ్వాడు. అంటే రాఘవేంద్రరావు లాంటి వాళ్లకు కూడా జగన్‌పై పీకల దాకా ఉంది’’ అని పోసాని మండిపడ్డారు.
‘‘ఇలాంటి వాళ్లు ఇండస్ట్రీలో ఉన్నారు. మహా అయితే నాకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వరు. ‘పోసాని గాడికి సినిమాలు ఇవ్వొద్దు. వాడ్ని తొక్కిపెడదాం’ అని అనుకుంటారు. కానీ నేను వెల్ సెటిల్డ్. ఎవడు తొక్కినా నేను వంగను. వంగే వాళ్లు వేరే ఉంటారు’’ అని ఆయన స్పష్టం చేశారు.