Tamil Nadu Governor: గవర్నర్ వర్సెస్ స్టాలిన్.. అసెంబ్లీలో మరో తీర్మానం!

MK Stalin Moves Resolution Against Tamil Nadu Governor

  • గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో రెండో సారి తీర్మానం పెట్టిన డీఎంకే సర్కారు
  • బిల్లులను ఆమోదించేలా ఆదేశాలివ్వాలని కేంద్రం, రాష్ట్రపతికి విజ్ఞప్తి 
  • ప్రజలకు మిత్రుడిగా ఉండటానికి గవర్నర్ సిద్ధంగా లేరన్న స్టాలిన్
  • సంక్షేమానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపాటు

తమిళనాడులో గవర్నర్ ఆర్ఎన్ రవి, డీఎంకే సర్కారుకు మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో ప్రభుత్వం పాస్ చేసిన బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడంపై సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో రెండోసారి గవర్నర్ కు వ్యతిరేకంగా తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు నిర్దిష్ట వ్యవధిలోగా ఆమోదం తెలిపేలా తమిళనాడు గవర్నర్‌కు తక్షణమే తగిన ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములను కోరారు.

సోమవారం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా స్టాలిన్ మాట్లాడారు. ‘‘ప్రజల సంక్షేమానికి విరుద్ధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారు. ఇది నేను గవర్నర్ కు వ్యతిరేకంగా ప్రవేశపెడుతున్న రెండో తీర్మానం. రాష్ట్ర ప్రభుత్వ అధికార వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకోకూడదని డాక్టర్ అంబేద్కర్ చెప్పారు. ప్రభుత్వానికి.. గవర్నర్ గైడ్‌గా ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. కానీ మన గవర్నర్ మాత్రం ప్రజలకు మిత్రుడిగా ఉండటానికి సిద్ధంగా లేరు’’ అని విమర్శించారు. 

తాము తీసుకొచ్చిన బిల్లును బహిరంగ వేదికపై గవర్నర్ విమర్శించారని, ప్రజల సంక్షేమానికి వ్యతిరేకంగా నిలుస్తున్నారని స్టాలిన్ మండిపడ్డారు. ‘‘తమిళనాడు ప్రజల కోసం తీసుకొచ్చిన బిల్లుల గురించి ఆయన బహిరంగ వేదికపై మాట్లాడారు. ప్రత్యేకించి ప్రధాన మంత్రి చెన్నై వచ్చినప్పుడు లేదా నేను ఢిల్లీకి వెళ్లినప్పుడు వ్యాఖ్యలు చేశారు. ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ బ్యాన్ బిల్లుకు ఆమోదం తెలిపేందుకు నిరాకరించారు’’ అని విమర్శించారు. డీఎంకే, ఇతర మిత్ర పక్షాల వాయిస్ ఓటుతో తీర్మానం పాస్ అయింది. తమకు మాట్లాడేందుకు సమయం ఇవ్వలేదంటూ ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.

  • Loading...

More Telugu News