China: అరుణాచల్ ప్రదేశ్ లో అమిత్ షా పర్యటన.. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన చైనా

China opposes Amit Shahs trip to Arunachal Pradesh

  • అరుణాచల్ ప్రదేశ్ లో అమిత్ షా రెండు రోజుల పర్యటన
  • సరిహద్దులో ఉన్న కిబితూ గ్రామంలో వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ను ప్రారంభించనున్న అమిత్ షా
  • అరుణాల్ ప్రదేశ్ తమదేనన్న చైనా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన పట్ల చైనా తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ చైనాకు చెందిన భూభాగమని... అక్కడ అమిత్ షా పర్యటించడం తమ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడమే అవుతుందని అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు శాంతి ప్రక్రియకు ఏ మాత్రం మేలు చేయవని వ్యాఖ్యానించింది. 

గత నెలలోనే అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల పేర్లను చైనా మార్చింది. ఆ రాష్ట్రాన్ని చైనా జాంగ్నాన్ అని పిలుస్తోంది. జాంగ్నాన్ లో భారత నేతలు, అధికారులు పర్యటించడం సరిహద్దు సమస్యల పరిష్కారానికి ఏమాత్రం సహకరించవని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. 

అరుణాచల్ ప్రదేశ్ లో ఈరోజు, రేపు అమిత్ షా పర్యటన కొనసాగనుంది. తన పర్యటనలో భాగంగా ఇండియా-చైనా సరిహద్దులో ఉన్న కిబితూ గ్రామంలో అమిత్ షా వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాంను లాంచ్ చేయనున్నారు. 

మరోవైపు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బగ్చి ఈ అంశంపై స్పందిస్తూ... చైనా ఇలాంటి అభ్యంతరాలను వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కాదని అన్నారు. గతంలో చైనా ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడల్లా మనం తిప్పికొడుతూనే వచ్చామని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ అనేది భారత్ అంతర్భాగమని అన్నారు. చైనా కొత్తగా పేర్లను పెట్టడం ద్వారా ఒరిగేది ఏమీ లేదని విమర్శించారు. ఇదే అంశంలో అమెరికా సైతం ఇండియాకు మద్దతుగా నిలిచింది. చైనా వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు ప్రకటించింది.

  • Loading...

More Telugu News