Bandi Sanjay: జీతాలే ఇవ్వలేనివాడు.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు బిడ్ వేస్తాడంట: బండి సంజయ్
- హామీలు నెరవేర్చలేని వాడు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాడని బండి ఎద్దేవా
- కేసీఆర్ కొడుకు, బిడ్డ మాదిరి దొంగ దందాలు చేయలేదని వ్యాఖ్య
- వరంగల్ పోలీస్ కమిషనర్ పై పరువునష్టం దావా వేస్తున్నట్టు వెల్లడి
వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేయడానికి కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బిడ్డింగ్ లో పొల్గొనాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఉద్యోగులకు ఒకటో తేదీన సక్రమంగా జీతాలు కూడా ఇవ్వలేని వాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొంటాడంట అని ఎద్దేవా చేశారు. రైతులకు రుణమాఫీ, నిరుద్యోగ భృతి సహా ఏ ఒక్క హామీని నెరవేర్చలేని వాడు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. కన్నతల్లికి అన్నం పెట్టలేనోడు పినతల్లికి బంగారు కడియాలు చేయిస్తానన్నట్టుగా కేసీఆర్ వ్యవహార శైలి ఉందని అన్నారు.
బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానని, 20 వేల మందికి ఉద్యోగాలు ఇస్తానని కేసీఆర్ గొప్పగా చెప్పాడని... ఆ మాట చెప్పి ఏళ్లు గడుస్తున్నాయని, దమ్ముంటే ఇప్పుడు ఫ్యాక్టరీ పెట్టు అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. తన బెయిల్ ను రద్దు చేయాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై స్పందిస్తూ... తానేమైనా టెర్రరిస్టునా? లేక నక్సలైట్ నా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కొడుకు, బిడ్డ మాదిరి లంగ, దొంగ దందాలు తాను చేయలేదని చెప్పారు. వరంగల్ పోలీస్ కమిషనర్ పై పరువునష్టం దావా వేస్తానని చెప్పారు. ఆయన అవినీతి, అక్రమాల చిట్టాను బయటపెడతానని అన్నారు.