Vizag Steel Plant: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వెనుక భారీ కుట్ర: మంత్రి కేటీఆర్
- చత్తీస్ గఢ్ లోని బైలదిలా గనులపై అదానీ, కేంద్ర పెద్దల కన్ను పడిందన్న కేటీఆర్
- ఆ గనులు అదానీ చేతుల్లోకి వెళ్తే విశాఖ ఉక్కుకు, తెలంగాణకు నష్టమని వెల్లడి
- బైలదిలాను కాపాడుకోవాలంటే విశాఖ ఉక్కు ముఖ్యమని వ్యాఖ్య
- నష్టాల పేరుతో తన దోస్తులకు చౌకగా విక్రయించడం మోదీ విధానమని ఆరోపణ
- ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందన్నది కాదు.. కేంద్రం ఏం చేస్తుందన్నదే ముఖ్యమన్న మంత్రి
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వెనుక భారీ కుట్ర ఉందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. స్టీల్ ప్లాంట్‌ను కావాలనే నష్టాల్లోకి నెట్టారని, అదానీ కోసమే ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగంలోని నవరత్నాలను.. మోదీ తన ఇద్దరి ఇష్టరత్నాలకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని చెప్పారు. నష్టాలను చూపించి.. తన దోస్తులకు చౌకగా విక్రయించడం ప్రధాని మోదీ విధానమని అన్నారు. తెలుగు రాష్ట్రాలపై మోదీ చేస్తున్న కుట్రను.. ఎండగట్టేందుకు బీఆర్ఎస్ కృషి చేస్తోందని చెప్పారు.
ఈ రోజు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘‘ప్రభుత్వ రంగ సంస్థలకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. వాటిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో.. బీహెచ్ఈఎల్ కు నేరుగా అధిక ఆర్డర్లు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ’’ అని చెప్పారు. నష్టాలను ప్రజలకు.. లాభాలను నచ్చిన వారికి అప్పగించడం కేంద్రం ఆలోచనగా కనిపిస్తోందని కేటీఆర్ ఆరోపించారు.
సెయిల్ (ఎస్ఏఐఎల్) ద్వారా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పరిశీలిస్తామని విభజన చట్టంలో కేంద్రం స్పష్టంగా చెప్పిందని కేటీఆర్ గుర్తు చేశారు. బయ్యారం, కడపలో స్టీల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఎన్నోసార్లు కలిశానని, చత్తీస్ గఢ్ లోని బైలాదిలా నుంచి బయ్యారానికి.. 50 శాతం పైప్‌లైన్ ఖర్చు భరిస్తామని చెప్పామని అన్నారు. 2014 నుంచి బయ్యారం గురించి ప్రశ్నిస్తున్నామని, కేంద్ర మంత్రులను కలిసినా ఎలాంటి లాభం లేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘బైలదిలా గనులపై అదానీ, కేంద్ర పెద్దల కన్ను పడింది. 160 కిలోమీటర్ల దూరంలోని బయ్యారానికి ఐరన్ ఓర్ ఇచ్చేందుకు వీలు కాదని చెప్పి.. 1,800 కిలోమీటర్ల దూరంలోని ముంద్రా (గుజరాత్)కు తరలించేందుకు సిద్ధమయ్యారు. 2018 సెప్టెంబర్‌లో అదానీ గ్రూప్.. ఐరన్ ఓర్ కంపెనీ పెట్టింది. బైలదిలా నుంచి ఐరన్ ఓర్‌ను.. ముంద్రాకు తరలించేలా ప్లాన్ చేసింది. బైలదిలా గనులు బయ్యారం, విశాఖకు దగ్గర్లోనే ఉన్నాయి. బైలదిలాలో 1.34 బిలియన్ టన్నుల ఐరన్ ఓర్ లభిస్తుంది. ఆ గనులు అదానీ చేతుల్లోకి వెళ్తే.. విశాఖ ఉక్కుకు, తెలంగాణకు నష్టం’’ అని కేటీఆర్ వివరించారు.
బైలదిలాను కాపాడుకోవాలంటే.. ముందుగా విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాలని కేటీఆర్ అన్నారు. రాజకీయాల కోసమే విశాఖ ఉక్కుపై మాట్లాడుతున్నామనేది అవాస్తవమన్నారు. ‘‘ప్రభుత్వ రంగ సంస్థల సంరక్షణ విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిపై మాకు ఆసక్తి లేదు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందన్నది కాదు.. కేంద్రం ఏం చేస్తుందన్నదే ముఖ్యం’’ అని చెప్పుకొచ్చారు.