Kiren Rijiju: 1975లో మాత్రమే ప్రజాస్వామ్యం చచ్చిపోయింది.. సోనియాకు కేంద్ర మంత్రి కౌంటర్
- కేంద్రం, మోదీపై విమర్శలు చేస్తూ సోనియా గాంధీ వ్యాసం
- ఎమర్జెన్సీని ప్రస్తావించి కౌంటర్ ఇచ్చిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
- ప్రజాస్వామ్యం గురించి సోనియా ఉపన్యాసాలు ఇస్తున్నారా? అంటూ ఎద్దేవా
మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. ప్రజాస్వామ్య మూల స్తంభాలను కూల్చివేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజు కౌంటర్ ఇచ్చారు. ‘‘భారత ప్రజాస్వామ్యం 1975లో ఒక్కసారి మాత్రమే చచ్చిపోయింది. ఆ తర్వాత అది మళ్లీ జరగలేదు. ఎప్పటికీ జరగదు కూడా’’ అని స్పష్టం చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించిన విషయాన్ని పరోక్షంగా ఆయన ఆ విధంగా ప్రస్తావించారు.
‘‘మేం చట్టబద్ధమైన పాలనను విశ్వసిస్తాం. దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి సజీవంగా ఉంది. ఎన్నికైన ప్రభుత్వాన్ని అన్ని ప్రశ్నలూ అడగండి, కానీ మీ సొంత దేశాన్ని ప్రశ్నించొద్దు’’ అని రిజిజు హితవుపలికారు. ‘‘ప్రజాస్వామ్యం గురించి సోనియా గాంధీ ఉపన్యాసాలు ఇస్తున్నారా? న్యాయవ్యవస్థ స్వతంత్రత గురించి కాంగ్రెస్ మాట్లాడటమంటే.. అత్యంత అసంబద్ధమైన భ్రమ కలిగించే ప్రకటన చేయడమే’’ అని ఎద్దేవా చేశారు.
‘బలవంతపు నిశ్శబ్దం భారతదేశ సమస్యలను పరిష్కరించదు’ అనే శీర్షికతో ‘ది హిందూ’ వార్తా పత్రికలో సోనియా వ్యాసం రాశారు. అందులో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శించారు. ప్రధాని మోదీ చేసే ప్రకటనలు దేశంలోని అత్యంత ముఖ్యమైన సమస్యలను విస్మరించేలా ప్రజల దృష్టిని మరల్చడానికి చేసే విన్యాసాలని ఎద్దేవా చేశారు. దేశ ప్రజాస్వామ్యంలో మూడు స్తంభాలను క్రమపద్ధతిలో కూల్చివేస్తోందని ఆరోపించారు.