Ranganath: బండి సంజయ్ కోపంగా ఉన్నట్టున్నారు... నేను మాత్రం పరువునష్టం దావా వేయను: వరంగల్ సీపీ

Warangal CP Ranganth reacts to Bandi Sanjay allegations

  • తెలంగాణలో పదో తరగతి హిందీ పేపర్ లీక్ కేసులో సంజయ్ అరెస్ట్
  • సీపీ రంగనాథ్ పై తీవ్ర ఆరోపణలు చేసిన బండి సంజయ్
  • ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చిన వరంగల్ సీపీ
  • బండి సంజయ్ తో తనకేమీ గట్టు పంచాయితీ లేదని వ్యాఖ్యలు

తెలంగాణ పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం కేసు పలు విధాలుగా రూపాంతరం చెందుతోంది. ఈ కేసును విచారిస్తున్న వరంగల్ సీపీ రంగనాథ్ పై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడడం తెలిసిందే. 

విజయవాడ సత్యంబాబు కేసులో సీపీ పాత్ర ఏమిటో తనకు తెలుసని, సీపీ రంగనాథ్ ను వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. నీ ఆస్తిపాస్తుల జాబితా బయటకు తీస్తా... నల్గొండలో ఏంచేశావో, ఖమ్మంలో ఏంచేశావో అంతా తెలుసు... వీటన్నింటిపై ప్రమాణం చేయగలవా? అని బండి సంజయ్ నిప్పులు చెరిగారు. 

ఈ వాఖ్యలపై వరంగల్ సీపీ రంగనాథ్ మీడియా సమావేశంలో స్పందించారు. వాళ్ల ఆరోపణలకు నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడంలేదని అన్నారు. తాను సెటిల్ మెంట్ చేసినట్టు నిరూపిస్తే ఉద్యోగం వదిలేస్తానని స్పష్టం చేశారు. సత్యంబాబు కేసుపై బండి సంజయ్ కి పూర్తిగా అవగాహన లేదని, సత్యంబాబు కేసును తాను హ్యాండిల్ చేయలేదని సీపీ రంగనాథ్ వెల్లడించారు. 

కేసుల్లో నిందితులుగా ఉన్నవాళ్లు దర్యాప్తును తప్పుబట్టడం సాధారణం అని వ్యాఖ్యానించారు. గతంలో చేయని ఆరోపణలు ఇప్పుడెందుకు చేస్తున్నారు? అని ప్రశ్నించారు. హిందీ పేపర్ లీక్ దర్యాప్తును రాజకీయ కోణంలో చూడొద్దని హితవు పలికారు. 

"బండి సంజయ్ తో నాకేమైనా గట్టు పంచాయితీ ఉందా? లీక్ కేసులో కోర్టుకు సాక్ష్యాలు, ఆధారాలు సమర్పిస్తాం. బండి సంజయ్ ఫోన్ మా వద్దకు రాలేదు. ఆ రోజు రాత్రి 1.14 గంటలకు లాస్ట్ కాల్ ఉంది. ఫోన్ లాస్ట్ లొకేషన్ బెజ్జంకి అని చూపిస్తోంది. దీనికి సంబంధించి మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. బండి సంజయ్ కోపంగా ఉన్నట్టున్నారు... కావలంటే పరువునష్టం దావా వేసుకోవచ్చు. నేను మాత్రం పరువునష్టం దావా వేయను" అని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. 

ఏదైనా కేసు విచారించే పోలీసులకు సెంటిమెంట్లు ఉండవని, తాము పోలీసు ఉద్యోగంలో చేరేటప్పుడే ఆ మేరకు ప్రమాణం చేస్తామని వెల్లడించారు. ఇప్పుడు కొత్తగా ప్రమాణం చేయాల్సిందేమీ లేదని అన్నారు.

  • Loading...

More Telugu News