Nara Lokesh: మైనారిటీలకు ఎవరి హయాంలో న్యాయం జరిగిందో చర్చకు అంజాద్ బాషా సిద్ధమా?: లోకేశ్

Nara Lokesh challenges Deputy CM Amzad Basha

  • తాడిపత్రి నియోజకవర్గంలోకి ప్రవేశించిన యువగళం
  • లోకేశ్ కు తాడిపత్రి నియోజకవర్గంలో అపూర్వ స్వాగతం
  • ఎప్పట్లాగానే వివిధ వర్గాలతో లోకేశ్ సమావేశాలు
  • స్పష్టమైన హామీలు ఇస్తూ ముందుకు సాగిన టీడీపీ అగ్రనేత 

తాడిపత్రి నియోజకవర్గంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు జనం పోటెత్తారు. 67వ రోజు యువగళం పాదయాత్ర ఉలికుంటపల్లి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. పాదయాత్ర ప్రారంభానికి ముందు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసిన లోకేశ్ నివాళులర్పించారు. 

సింగంగుట్టపల్లి వద్ద పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలో ప్రవేశించగానే నియోజకవర్గ ఇన్ చార్జి జేసీ ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో వేలాది కార్యకర్తలు లోకేశ్ కు ఘనస్వాగతం పలికారు. బాణాసంచా పేలుళ్లు, కార్యకర్తల కేరింతలకు ఆ ప్రాంతమంతా హోరెత్తింది. అడుగడుగునా యువనేతపై పూలవర్షం కురిపించారు. జై లోకేశ్, జై టీడీపీ నినాదాలతో హోరెత్తించారు..

ధ‌ర్మవ‌రం క‌బ్జాల్లో అబ్బాయి కేటు... తాడిప‌త్రి దోపిడీల్లో బాబాయ్ సెప‌'రేటు'!

తాడిపత్రి మండలం పెదపప్పూరు వద్ద పెన్నానదిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి అక్రమ ఇసుక తవ్వకాలను చూసిన యువనేత లోకేశ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "యువగళం పాదయాత్రలో అబ్బాయ్ ధ‌ర్మవ‌రం ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ కేటు క‌బ్జాలు చూశాం. తాడిప‌త్రి వ‌చ్చాం. అబ్బాయి ఏక్ నంబ‌ర్ సెటిల్మెంట్లు అయితే, ఇక్కడ బాబాయ్ ద‌స్ నంబ‌ర్ దందా. అబ్బాయి కేతిరెడ్డి కేటు అయితే బాబాయ్ కేతిరెడ్డి దోపిడీలో సెప‌'రేటు'. 

తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గం పెద్దపప్పూరు మండలం పెన్నానదిలో పెద్దారెడ్డి మాఫియా పెద్దఎత్తున ఇసుక తవ్వి తరలించే రీచ్ వద్ద సెల్ఫీ దిగాను. ఇసుక తవ్వకాలకు10 ఎకరాలు కేటాయిస్తే, అంతకంటే ఎన్నో రెట్ల అధిక విస్తీర్ణంలో ఇసుక తవ్వకాలు జరిపి బాబాయ్ గ్యాంగ్ కోట్లు దండుకుంటోంది. ఈ విషయం మీద పోరాటం చేసిన మాజీ ఎమ్యెల్యే జేసీ ప్రభాకర రెడ్డి మీద అక్రమ కేసులు బనాయించి హింసించారు. 

ప్రతి రోజు ఈ రీచ్ నుండి సుమారుగా 150 టిప్పర్ల ఇసుక తరలిస్తోంది ఈ ముఠా. ధర్మవరంలో అబ్బాయ్ ఇసుక దోపిడీలో అడ్డంగా దొరికిపోవడంతో బాబాయ్ పెద్దారెడ్డి కాస్త జాగ్రత్త పడ్డాడు. నా పాదయాత్ర అటుగా వెళుతుంది అని తెలిసి రెండు రోజుల క్రితమే రీచ్ బంద్ చేసి దుకాణం సర్దేశాడు. కానీ చేసిన ప్రకృతి విధ్వంసం ఎక్కడికి పోతుంది? ఇవిగో గుడ్ మార్నింగ్ కేటు బాబాయ్ ఇసుక మాఫియాకి సంబంధించిన ఆధారాలు" అంటూ లోకేశ్ వ్యాఖ్యానించారు.

దూదేకుల సామాజికవర్గీయులతో లోకేశ్ సమావేశం

తాడిపత్రి నియోజకవర్గం పెదపప్పూరులో దూదేకుల ముస్లిం సామాజికవర్గీయులతో లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... గతంలో తాడిపత్రి ఎలా ఉండేది, ఇప్పుడు తాడిపత్రి లో ఏం జరుగుతుంది ఒక్క సారి ప్రజలు ఆలోచించాలని సూచించారు. "నాపై 20కి పైగా కేసులు ఉన్నాయి. ప్రభాకర్ రెడ్డి గారిపై 70 కేసులు ఉన్నాయి. అయినా ప్రజల తరఫున పోరాడుతున్నాం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం లను వేధించి చంపేస్తున్నారు. 

కర్నూలు లో అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించి చంపేశారు. మిస్బా అనే 10వ తరగతి అమ్మాయిని వైసీపీ నేత వేధించి చంపేసాడు. ఈ అరాచకాలను ఇక ఎంతకాలం భరిస్తారు? టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం. వక్ఫ్ భూములు కాపాడటానికి వక్ఫ్ బోర్డుకి జ్యుడిషియల్ పవర్ కల్పిస్తాం. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని జగన్ మోసం చేశాడు. ఎవరి హయాంలో మైనార్టీలకు న్యాయం జరిగిందో చర్చకు నేను సిద్దం... డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు సిద్దమా?" అని లోకేశ్ సవాల్ విసిరారు

తాడిపత్రిని అభివృద్ధి చేసింది జేసీ కుటుంబమే!

తాడిపత్రిని జేసీ కుటుంబం అద్భుతంగా అభివృద్ది చేసింది అని లోకేశ్ కొనియాడారు. "గతంలో తాడిపత్రి వచ్చి మున్సిపల్ కార్యాలయం చూసినప్పుడు నేను ఆశ్చర్యానికి గురయ్యాను. కార్పొరేషన్ కి కూడా అంత అద్భుత భవనం ఉండదు. తాడిపత్రికి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించింది జేసీ ప్రభాకర్ రెడ్డి. కానీ ఇంకా ఏదో వస్తుంది అని ఆశించి పాలిచ్చే ఆవుని వద్దనుకొని తన్నే దున్నపోతు ని తెచ్చుకున్నారు. అప్పుడు అభివృద్ధిలో నంబర్ 1 గా ఉన్న తాడిపత్రి ఇప్పుడు అవినీతిలో నంబర్ 1 గా ఉంది" అని ఆవేదన వ్యక్తం చేశారు. 

హిజ్రాల సమస్యల పట్ల సానుభూతితో స్పందించిన లోకేశ్

తాడిపత్రి నియోజకవర్గం పెదపప్పూరులో హిజ్రాలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై యువనేత లోకేశ్ కు వినతిపత్రం సమర్పించారు. సమాజంలో తాము చాలా వివక్షకు గురవుతున్నామని, తమకు ఎటువంటి జీవనోపాధి లేదని వాపోయారు. 

"దుర్భర దారిద్ర్యంలో కూరుకుపోయాం. గత ప్రభుత్వం మాకు పెన్షన్ ఇచ్చేది. ఇళ్లు లేనివారికి స్థలాలు కేటాయించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మా పెన్షన్లు నిలిపేశారు. మాకు సొంత ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేవు. మీరు అధికారంలోకి వచ్చాక పెన్షన్లు పునరుద్ధరించి, మాకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇవ్వాలి" అని లోకేశ్ ను కోరారు. లోకేశ్ వారి సమస్యలను సానుభూతితో విన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిజ్రాల సమస్యల్ని దేశంలో మొదటిసారిగా గుర్తించి పెన్షన్లు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు అని వెల్లడించారు. "2018 జనవరిలో జీఓ ఎంఎస్-7 ద్వారా రాష్ట్రంలోని సుమారు 30 వేల మంది హిజ్రాలకు పెన్షన్లు మంజూరు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక హిజ్రాలకు పెన్షన్లను పునరుద్ధరిస్తాం. హిజ్రాలకు వైసీపీ ప్రభుత్వం నిలిపేసిన సంక్షేమ పథకాలన్నీ పునఃప్రారంభిస్తాం. ఇళ్ల స్థలం, సొంత ఇళ్లు లేనివారికి తప్పకుండా ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేస్తాం. టీడీపీ హయాంలో రాష్ట్ర బడ్జెట్లో హిజ్రాల సంక్షేమం కోసం రూ.20 కోట్లు కేటాయించిన ఘనత చంద్రబాబుది. స్వయం ఉపాధిని కోరుకునే హిజ్రాలను ప్రోత్సహిస్తాం. ఉపాధి అవకాశాలు కల్పిస్తాం" అని భరోసా ఇచ్చారు.

లోకేశ్ ను కలిసిన జాతీయ చేనేత ఐక్య వేదిక ప్రతినిధులు

తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరులో జాతీయ చేనేత ఐక్య వేదిక ప్రతినిధులు లోకేశ్ ను కలిసి చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో 40 నియోజకవర్గాల్లో చేనేతలు ఉన్నారని, నేతన్న నేస్తం కింద ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్న రూ.24 వేలను రూ.50 వేలకు పెంచితే తమకు మేలు జరుగుతుందని తెలిపారు. 

"చేనేతలు తయారు చేసిన వస్త్రాలకు మార్కెంటింగ్ సౌకర్యం కల్పించాలి. ఆప్కో ద్వారా కొనుగోలు చేయాలి. చేనేత వస్త్రాలకు వాడే రసాయనాలపై జీఎస్టీని రద్దు చేయాలి. పవర్ లూమ్స్ చీరలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. చేనేత కార్మిక కుటుంబాలకు రూ.10 లక్షలు బీమా అందించాలి. మా సామాజికవర్గానికి 30 ఎమ్మెల్యే సీట్లు, ఒకరికి మంత్రి పదవి, నామినేటెడ్ పోస్టులు ఇప్పించాలి" అని లోకేశ్ కు విజ్ఞప్తి చేశారు. 

లోకేశ్ స్పందిస్తూ... జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటినుండి చేనేత రంగం తీవ్రమైన సంక్షోభంలో ఉందని అన్నారు. ఒక్క ధర్మవరంలోనే 55 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఆత్మహత్య చేసుకున్న చేనేతల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చేనేతలకు 200 యూనిట్లు, మరమగ్గాల వారికి 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందిస్తామని స్పష్టం చేశారు. 

టీడీపీ పాలనలో చేనేతలకు ముడిసరుకు, రసాయనాలను ధరలు తగ్గించి ఆదుకున్నామని, చేనేతల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. చేనేతలకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.


*యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం 859.7 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 14.2 కి.మీ.*

*68వరోజు (12-4-2023) యువగళం వివరాలు:*

*తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం*

ఉదయం

7.00 – పసలూరు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

7.30 – కొట్టాలపల్లి క్రాస్ వద్ద మిర్చి రైతులతో సమావేశం.

8.10 – కమ్మవారిపల్లి వద్ద నిరుద్యోగ యువతతో భేటీ.

9.50 – నగరారు వద్ద రైతులతో సమావేశం.

11.00 – తుట్రపల్లి వద్ద భోజన విరామం.

మధ్యాహ్నం

2.55 – తుట్రపల్లి నుంచి పాదయాత్ర కొనసాగింపు.

3.15 – తుట్రపల్లి ఎస్సీ కాలనీలో సీనియర్ సిటిజన్లతో సమావేశం.

3.25 – తుట్రపల్లిలో పట్టు రైతులతో సమావేశం.

3.35 – టి.కొత్తపల్లిలో అరటిరైతులతో భేటీ.

3.45 – రామరాజుపల్లిలో ఎన్టీఆర్ గృహాల బాధిత లబ్ధిదారులతో సమావేశం.

సాయంత్రం

4.10 – కూర్మాజీపేటలో స్థానికులతో సమావేశం.

4.35 – రాయలచెరువు ఎస్సీ కాలనీలో స్థానికులతో సమావేశం.

4.45 – రాయలచెరువులో స్థానికులతో భేటీ.

5.00 – రాయలచెరువులో బహిరంగసభ, యువనేత లోకేశ్ ప్రసంగం.

6.30 – రాయలచెరువు సమీపంలోని విడిది కేంద్రంలో బస.

  • Loading...

More Telugu News