BJP: ఎన్నికల వేళ కర్ణాటక బీజేపీ ప్రయోగం.. 70 ఏళ్లు దాటిన వారికి టికెట్ లేదట!

BJP Asks Karnataka Ex Chief Minister Jagadish Shettar Not To Contest In Comming Polls

  • పార్టీలో చర్చనీయాంశంగా మారిన అధిష్ఠానం నిర్ణయం
  • రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన కేఎస్ ఈశ్వరప్ప
  • సీనియర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ జగదీశ్ శెట్టర్ ఫైర్
  • పోటీ చేసి తీరుతానని స్పష్టీకరణ

వచ్చే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ బీజేపీ అధిష్ఠానం పార్టీలో కాకరేపే నిర్ణయం తీసుకుంది. 70 ఏళ్లు దాటిన వారికీ, గెలిచే అవకాశాలు అంతంత మాత్రమే ఉండే నేతలకు టికెట్ ఇవ్వకూడని నిర్ణయించింది. అంతేకాదు, ఈ విషయాన్ని సీనియర్లకు చేరవేసినట్టు కూడా తెలుస్తోంది. అధిష్ఠానం తీసుకున్న ఈ నిర్ణయం పార్టీ సీనియర్లలో చర్చనీయాంశమైంది.

పార్టీ నిర్ణయంతో మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప (74) రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అంతేకాదు, తనకు ఈసారి టికెట్ ఇవ్వొద్దని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు.

మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ (67) కూడా ఈ విషయమై తనకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చినట్టు తెలిపారు. పోటీ నుంచి తప్పుకోవాలని కోరారని, అందుకు తాను నిరాకరించానన్నారు. తానింకా పదేళ్లపాటు రాజకీయాల్లో కొనసాగగలనన్న ధీమా వ్యక్తం చేశారు. 

తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని, పోటీ చేసిన ప్రతిసారి 25 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సీఎంగా పనిచేసిన తనలాంటి సీనియర్లకు పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా? అని ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్ఠానంతో మాట్లాడి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని జగదీశ్ శెట్టర్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News