Myanmar: మయన్మార్‌లో కొనసాగుతున్న సైన్యం దురాగతం.. వైమానిక దాడుల్లో 100 మంది మృతి!
- పెచ్చుమీరుతున్న సైన్యం అరాచకాలు
- 2021లో ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారం చేజిక్కించుకున్న సైన్యం
- సైన్యం దాడుల్లో ఇప్పటి వరకు 3 వేల మంది మృతి
- ప్రతిపక్ష కార్యక్రమంపై తాజాగా వైమానిక దాడి
మయన్మార్‌లో సైన్యం అరాచకాలకు అంతూపొంతు లేకుండా పోతోంది. సైనిక పాలనను వ్యతిరేకించే ఓ వర్గం నిర్వహించిన కార్యక్రమంపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో 100 మంది వరకు మరణించినట్టు తెలుస్తోంది. వీరిలో పలువురు చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు
ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసి ఫిబ్రవరి 2021లో సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పటి నుంచి తమను వ్యతిరేకించే వారిని సైన్యం ఉక్కుపాదంతో అణచివేస్తోంది. బలగాల దాడిలో ఇప్పటి వరకు దాదాపు 3 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా మాండలేకు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న పజిగ్గీ గ్రామంలో సైనిక పాలనను వ్యతిరేకించే ప్రతిపక్షం నిన్న స్థానిక కార్యాలయ ఏర్పాటు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి 150 మంది హాజరయ్యారు. విషయం తెలిసిన సైన్యం ఆ కార్యక్రమంపై వైమానిక దాడికి దిగింది. ఈ ఘటనలో 100 మంది మరణించినట్టు ప్రజాస్వామ్య అనుకూల గ్రూప్, స్వతంత్ర మీడియా తెలిపాయి.