Pawan Kalyan: చీమలపాడు దుర్ఘటన అత్యంత దురదృష్టకరం: పవన్ కల్యాణ్
- ఖమ్మం జిల్లా చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం
- బాణసంచా కారణంగా అగ్నిప్రమాదంలో ముగ్గురి మృతి
- తీవ్ర విచారం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్
ఖమ్మం జిల్లా చీమలపాడులో బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆత్మీయ సమ్మేళనంలో విషాదం చోటుచేసుకోవడం తెలిసిందే. కార్యకర్తలు పేల్చిన బాణసంచా కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుని ముగ్గురు మృతి చెందారు. దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో ఇవాళ జరిగిన అగ్నిప్రమాదం అత్యంత దురదృష్టకరం అని పేర్కొన్నారు. బాణసంచా నిప్పురవ్వలు పడి పూరిల్లు అంటుకోవడం, ప్రమాదాన్ని నివారించే సమయంలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మరణించడం, మరో 11 మంది తీవ్రంగా గాయపడడం దుఃఖదాయకం అని తెలిపారు. ఈ ప్రమాదం, సంఘటన స్థలంలోని దృశ్యాలు భయానకంగా గోచరిస్తున్నాయని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని, వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నానని వెల్లడించారు. ప్రాణ నష్టం పూడ్చలేనిదని, మృతుల కుటుంబాలను ఆర్థికంగా అన్ని విధాలుగా ఆదుకోవాలని పవన్ సూచించారు.
శరీర అవయవాలు కోల్పోయిన క్షతగాత్రులకు ప్రభుత్వం అత్యంత మెరుగైన వైద్య సహాయం అందించాలని, వారికి జీవితాంతం అండగా నిలవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు.