Rajamouli: పిల్లలకు ఆ వయసు వచ్చేంత వరకు మొబైల్ ఫోన్ కొనివ్వకండి: రాజమౌళి

Dont give mobile to your children until the get 18 years says Rajamouli
  • సైబర్ మోసగాళ్ల వలలో పడేవారిపై సానుభూతిని చూపించనన్న రాజమౌళి
  • కార్మికుడి దగ్గర నుంచి వ్యాపారవేత్తల వరకు అందరూ సైబర్ మోసాల బాధితులేనని వ్యాఖ్య
  • పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని హితవు
అత్యాశకు పోయి సైబర్ మోసగాళ్ల వలలో పడేవాళ్లపై తాను ఏ మాత్రం సానుభూతిని చూపించనని ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి అన్నారు. కష్ట పడకుండా డబ్బులు ఊరికే రావనే విషయాన్ని అందరూ గ్రహించాలని సూచించారు. ఉచితంగా డబ్బులు వస్తాయన్నా, తక్కువ సమయంలోనే డబ్బులు రెట్టింపు అవుతాయన్నా అది కచ్చితంగా మోసమని గుర్తించాలని చెప్పారు. చిన్న కార్మికుడి నుంచి పెద్ద వ్యాపారవేత్తల వరకు సైబర్ మోసాల బారిన పడుతున్నారని అన్నారు. ఎవరికైనా డబ్బును పంపించే ముందు ఒక్క నిమిషం ఆలోచించాలని చెప్పారు. హైదరాబాద్ లో నిర్వహించిన 'హ్యాక్ సమ్మిట్ 2023' కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

న్యూడ్ కాల్స్ చేసి మోసం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని రాజమౌళి అన్నారు. కొత్త నంబర్ల నుంచి వచ్చే కాల్స్ ను లిఫ్ట్ చేయకపోవడమే మంచిదని సూచించారు. చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని, వారికి 18 ఏళ్లు వచ్చేంత వరకు మొబైల్ ఫోన్ కొనివ్వకపోవడమే మంచిదని చెప్పారు. సైబర్ నేరాలపై చేసే ప్రచారాలకు తనతో పాటు ఇతర సినీ ప్రముఖులు కూడా వస్తారని తెలిపారు. మరోవైపు రాజమౌళికి నగర పోలీస్ కమిషనర్ ఆనంద్ జ్ఞాపికను అందజేశారు.

Rajamouli
Cyber Crimes
Tollywood

More Telugu News