COVID19: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

India logs 10158 fresh cases in 24 hours

  • ఒక్కరోజే 10,158 మందికి పాజిటివ్
  • 45 వేలకు చేరిన యాక్టివ్ కేసులు
  • దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులలో 10 లక్షల బెడ్ లు సిద్ధం చేశామన్న అధికారులు

దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటలలో కొత్త కేసులు 10,158 నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ గురువారం వెల్లడించింది. వైరస్ పాజిటివిటీ రేట్ 4.42 శాతానికి పెరిగిందని అధికారులు తెలిపారు. దాదాపు 8 నెలల తర్వాత కేసులు భారీగా పెరిగాయని వివరించారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 44,998 కి చేరిందని తెలిపారు. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆసుపత్రులలో చేరుతున్న వారి సంఖ్య కానీ, మరణాల సంఖ్య కానీ పెద్దగా పెరగడం లేదని అన్నారు.

వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ఈ నెల 10, 11 తేదీలలో కేంద్ర ఆరోగ్య శాఖ దేశవ్యాప్తంగా కరోనా మాక్ డ్రిల్ నిర్వహించింది. ఇందులో 36,592 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు పాల్గొన్నాయి. ప్రస్తుతం దేశం మొత్తమ్మీద వివిధ ఆసుపత్రులలో 10 లక్షల బెడ్ లు సిద్ధంగా ఉన్నాయని, ఇందులో 3 లక్షల బెడ్ లకు ఆక్సిజన్ సదుపాయం ఉందని అధికారులు తెలిపారు.

దాదాపు 87 లక్షల పీపీఈ కిట్లు, 6.8 లక్షల ఆక్సిజన్ సిలిండర్లు, 77 వేల వెంటిలేటర్లు, 2.8 కోట్ల ఎన్ -95 మాస్కులు, 66.84 కోట్ల పారాసెటమాల్ డోసులు, 9.7 కోట్ల అజిత్రోమైసిన్ డోసులు, సుమారు 15 వేల అంబులెన్స్ లు (లైఫ్ సపోర్ట్ తో), 4.5 వేల అత్యాధునిక అంబులెన్స్ లతో పాటు కోవిడ్ మేనేజ్ మెంట్ శిక్షణ పొందిన 2 లక్షల మంది వైద్యులు అందుబాటులో ఉన్నారని వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News