Pm modi: అదానీకి, కర్ణాటక సర్కారుకు నిబంధనలు వర్తించవా?: కేటీఆర్
- అవినీతిపై ప్రసంగాలు, నిబంధనలకు అవి అతీతమంటూ ఎద్దేవా
- కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపై మంత్రి కేటీఆర్ విమర్శ
- ఈడీ, సీబీఐల తీరును జనం గమనిస్తున్నారని వ్యాఖ్య
అవినీతిపై ప్రధాని మోదీ గంటల తరబడి ప్రసంగిస్తారు కానీ కర్ణాటక సర్కారు కమీషన్ల వివాదంపై మాత్రం నోరు మెదపరని తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రధాని మోదీకి అవినీతిపై మాట్లాడడం చాలా తేలిక అని ఎద్దేవా చేశారు. అదానీకి మాత్రం ఈ ప్రసంగాలు, నిబంధనలు ఏవీ వర్తించవని విమర్శించారు. కేంద్ర దర్యాఫ్తు సంస్థల పైనా మంత్రి మండిపడ్డారు. ఈడీ, సీబీఐలు కేంద్రం చేతుల్లో కీలుబొమ్మలుగా మారిన తీరును ప్రజలు చూస్తూనే ఉన్నారని చెప్పారు. ఈమేరకు గురువారం కేంద్ర దర్యాఫ్తు సంస్థలపై ఆయన విమర్శలు గుప్పించారు.
బీజేపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసి, చాలా విషయాలు బయటపెట్టినందుకు జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ను అరెస్టు చేస్తారని భావిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. అవినీతి గురించి, దాని నిర్మూలన గురించి చెప్పే ప్రధాని మోదీ.. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం వసూలు చేస్తున్న కమీషన్ల గురించి మాట్లాడడం లేదేమని కేటీఆర్ ప్రశ్నించారు. అదానీ విషయంలో నిబంధనలు వర్తించవా అని నిలదీశారు.