assam: ఒకే వేదికపై 11వేల మంది డ్యాన్స్.. రికార్డు బద్దలు

Assams Traditional Bihu Dance Enters Guinness Book Of World Records
  • గువాహటిలోని సరుసజై స్టేడియంలో అరుదైన దృశ్యం
  • అసోం సంప్రదాయ నృత్యం బిహూను ప్రదర్శించిన 11,304 మంది 
  • గిన్నిస్ రికార్డులో ఈ ఘనతకు చోటు
ఒకే వేదికపై వందల సంఖ్యలో కళాకారులు నృత్యం చేస్తేనే చూసేందుకు రెండు కళ్లు చాలవు. అదే వేలాది మంది ఒకేసారి కాలు కదిపితే.. రికార్డులు బద్దలవడం ఖాయం. ఈశాన్య రాష్ట్రం అసోంలోని గువాహటి, సరుసజై స్టేడియంలో ఇదే జరిగింది. అసోం సంప్రదాయ నృత్యమైన బిహూ డ్యాన్స్‌ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో చోటు దక్కించుకుంది. ఒకే వేదికపై 11,304 మంది కళాకారులు, నృత్యకారులు బిహూ నృత్యాన్ని ప్రదర్శించి ఈ రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమంలో గాయకులతో పాటు అసోం సంప్రదాయ వాయిద్యాలైన ధోల్‌, తాల్‌, గోగోనా, టోకా, పెపా వంటివాటిని వాయించే సంగీత కళాకారులు కూడా పాల్గొన్నారు.  

అసోం సాంస్కృతిక వారసత్వానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అంతేకాదు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి రూ.25 వేలు గ్రాంట్ ప్రకటించింది. రాష్ట్ర వసంతోత్సవాలను పురస్కరించుకుని నేడు రాష్ట్రానికి రానున్న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సర్టిఫికెట్‌ను అందజేయనున్నారు. ఇక, బిహు నృత్య ప్రదర్శన అనంతరం అదే స్టేడియంలో 2548 మంది డ్రమ్మర్స్ డ్రమ్స్‌ వాయించారు. దాంతో, ఒకే చోట ఇంతపెద్ద సంఖ్యలో డ్రమ్మర్లు ఇచ్చిన ప్రదర్శన సైతం గిన్నిస్‌ రికార్డుల్లో చోటు దక్కించుకుంది.
assam
Traditional Bihu Dance
Guinness Book Of World Records
11304dancers

More Telugu News