Harry Brook: సన్ రైజర్స్ ఆటగాడు బ్రూక్ సెంచరీ... రేటుకు న్యాయం చేశావు బ్రో!
- ఈడెన్ గార్డెన్స్ లో సన్ రైజర్స్ × కోల్ కతా నైట్ రైడర్స్
- టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్
- 55 బంతుల్లో 100 పరుగులు చేసిన బ్రూక్
- ధాటిగా ఆడిన మార్ క్రమ్, అభిషేక్ శర్మ
ఐపీఎల్ మినీ వేలంలో ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ కు లభించిన ధర రూ.13.25 కోట్లు. ఇంగ్లండ్ తరఫున బ్రూక్ వరుస సెంచరీలతో హోరెత్తించడంతో అతడి కోసం వేలంలో పోటీపడిన సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ ధరకు దక్కించుకుంది. కానీ ఐపీఎల్ సీజన్ ప్రారంభం అయ్యాక బ్రూక్ వరుసగా విఫలం కావడంతో, అతడికి పెట్టిన రేటు సమంజసమేనా అనే అభిప్రాయాలు వినిపించాయి.
అయితే, విమర్శలన్నీ ఇవాళ పటాపంచలయ్యాయి. బ్రూక్ తన ధరకు న్యాయం చేస్తూ సెంచరీతో చెలరేగిపోయాడు. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లను వారి సొంతగడ్డపైనే చితక్కొట్టిన ఈ 24 ఏళ్ల కుర్రాడు కేవలం 55 బంతుల్లో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఈ మ్యాచ్ లో అన్ని రకాల క్రికెటింగ్ షాట్లు ఆడిన బ్రూక్ మొత్తం 12 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. ముఖ్యంగా ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో ఆఫ్ సైడ్ కొట్టిన సిక్సులు ఇన్నింగ్స్ కే హైలైట్ గా నిలిచాయి.
మరో ఎండ్ లో కెప్టెన్ మార్ క్రమ్ కూడా అర్ధసెంచరీతో విజృంభించగా, అభిషేక్ శర్మ దూకుడుగా ఆడాడు. మార్ క్రమ్ 26 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 సిక్సులతో 50 పరుగులు చేయగా.... అభిషేక్ శర్మ 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 32 పరుగులు చేశాడు. ఆఖర్లో హెన్రిచ్ క్లాసెన్ 6 బంతుల్లో 16 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మయాంక్ అగర్వాల్ (9), రాహుల్ త్రిపాఠి (9) విఫలమయ్యారు.
మొత్తమ్మీద సన్ రైజర్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 228 పరుగుల భారీ స్కోరు సాధించి కోల్ కతా బ్యాటింగ్ లైనప్ ముందు భారీ లక్ష్యాన్నుంచింది. కోల్ కతా బౌలర్లలో ఆండ్రీ రస్సెల్ 3 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తికి ఓ వికెట్ లభించింది. అయితే, మూడో వికెట్ తీసిన అనంతరం ఆండ్రీ రస్సెల్ గాయంతో మైదానాన్ని వీడాడు. రస్సెల్ బ్యాటింగ్ కు దిగే విషయంపై సందిగ్ధత నెలకొంది.