YS Vivekananda Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్
- హత్య గురించి ఉదయ్ కుమార్ రెడ్డికి ముందే తెలుసన్న సీబీఐ
- రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటపెట్టిన అధికారులు
- అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శిశ శంకర్ రెడ్డిలతో కలిసి ఎవిడెన్స్ ట్యాంపర్ చేశారని ఆరోపణ
వైఎస్ వివేకా హత్య కేసులో మరో సంచలన విషయాన్ని సీబీఐ బయటపెట్టింది. ఈ కేసుకు సంబంధించి అదుపులోకి తీసుకున్న ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టును కోర్టుకు అందజేసింది. ఇందులో ఎంపీ అవినాశ్ రెడ్డి పేరును మరోమారు ప్రస్తావించింది. వివేకా హత్య విషయం ఉదయ్ కుమార్ రెడ్డికి ముందే తెలుసని సీబీఐ తెలిపింది. హత్య జరిగిన అనంతరం వేకువ జామున ఆయన ఎంపీ అవినాశ్ రెడ్డి నివాసంలో ఉన్నారని పేర్కొంది. దీనికి సంబంధించి లొకేషన్ వివరాలను బయటపెట్టింది.
హత్య విషయం తెలిసిన 2 నిమిషాలలో ఉదయ్ కుమార్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారని సీబీఐ అధికారులు తెలిపారు. ఈ నలుగురికి సంబంధించిన గూగుల్ టేక్ అవుట్ ద్వారా సేకరించిన లొకేషన్ వివరాలను రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
నలుగురూ కలిసి హత్యా స్థలంలో సాక్ష్యాధారాలను తొలగించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశారని అధికారులు పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి ప్రమేయానికి సంబంధించిన అన్ని సైంటిఫిక్ ఆధారాలను సేకరించాకే ఆయనను అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.
ఉదయ్ కుమార్ రెడ్డి పారిపోతారనే అనుమానంతో అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అయితే, విచారణకు ఉదయ్ కుమార్ రెడ్డి ఏమాత్రం సహకరించడం లేదని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. హత్య జరిగిన అనంతరం ఆయన లొకేషన్ వివరాలను ముందు పెట్టి ప్రశ్నించినా ఉదయ్ కుమార్ రెడ్డి నోరు మెదపడంలేదని చెప్పారు.