Gangster Atiq Ahmed: అతీక్ అహ్మద్ కాల్చివేత కేసు.. యూపీ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు
- వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో అతీక్, ఆయన సోదరుడి కాల్చివేత
- మీడియా ముసుగులో వచ్చి కాల్పులకు తెగబడిన దుండగులు
- రాపిడ్ యాక్షన్ ఫోర్స్, అదనపు బలగాలను మోహరించిన అధికారులు
యూపీ గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రాఫ్ హత్యతో అప్రమత్తమైన పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ పోలీసు బలగాలను మోహరించారు. వైద్య పరీక్షల కోసం అతీక్ అహ్మద్, ఆయన సోదరుడిని గత రాత్రి ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో రిపోర్టర్ల ముసుగులో వచ్చిన ముగ్గురు దుండగులు వారిని అతి సమీపం నుంచి కాల్చి చంపారు. పోలీసులు, మీడియా ప్రతినిధుల సమక్షంలోనే ఈ ఘటన జరగడం కలకలం రేపింది. కాల్పులకు సంబంధించిన దృశ్యాలు మీడియా కెమెరాల్లో రికార్డయ్యాయి.
ప్రయాగ్‌రాజ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ముందు జాగ్రత్త చర్యగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సహా అదనపు బలగాలను రప్పించి అన్ని జిల్లాల్లోనూ మోహరించారు. అతీక్, ఆయన సోదరుడిని కాల్చి చంపిన ముగ్గురు నిందితులను ఆ వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మీడియా ప్రతినిధుల ముసుగులో వచ్చి ఘాతుకానికి పాల్పడినట్టు ప్రయాగ్‌రాజ్ పోలీసులు తెలిపారు.
అతీక్, ఆయన సోదరుడు అష్రాఫ్ హత్య జరిగిన వెంటనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన జుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.