lemon juice: ఆరోగ్యానికి అమ్మ వంటిది ‘నిమ్మ’
- నిమ్మలో విటమిన్ సీ పుష్కలంగా లభ్యం
- రోగ నిరోధక శక్తి బలోపేతంలో ముఖ్యపాత్ర
- కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా రక్షణ
- మధుమేహం నియంత్రణకు సైతం సాయం
నిమ్మ (లెమన్) మన రోజువారీ జీవనంలో భాగంగా ఉండాలి. ప్రతి రోజూ నిమ్మరసం తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తికి కీలకం. అలాగే, క్యాల్షియం, ఫొలేట్, పొటాషియం కూడా లభిస్తాయి. కనుక నిమ్మను తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి బలపడుతుంది. గుండె జబ్బులు, కిడ్నీలో రాళ్లు రాకుండా రక్షణ లభిస్తుంది. మన శరీరం వివిధ పదార్థాల్లోని ఐరన్ ను గ్రహించాలంటే అందుకు విటమిన్ సీ చాలా అవసరం. చర్మం నిగారింపును సైతం నిమ్మ పెంచుతుంది.
- గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె వేసి ఉదయం తాగడం వల్ల గొంతు మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. విటమిన్ సీ గొంతును శుభ్రం చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేయడం వల్ల అలెర్జీ సమస్యలు కూడా ఉపశమిస్తాయి.
- కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిమ్మ అడ్డుకుంటుంది. సిట్రేట్ స్థాయిలను పెంచడం వల్ల ఈ రక్షణ ఏర్పడుతుంది. ఈ సిట్రేట్ క్యాల్షియంకు అతుక్కుంటుంది. దీంతో క్యాల్షియం కారణంగా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా సిట్రేట్ సాయపడుతుంది.
- నిమ్మకాయల పైతొక్క, లోపలి గుజ్జులో సొల్యుబుల్ ఫైబర్ ఎక్కువ. దీన్ని పెక్టిన్ అంటారు. కాలేయంలో జీర్ణ రసాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది.
- ఫైబర్ ఉన్న పండు ఏది తిన్నా కానీ అది రక్లంలో గ్లూకోజ్ నియంత్రణకు సాయపడుతుంది. దీంతో మధుమేహం రిస్క్ ను తగ్గించుకోవచ్చు. మధుమేహం బారిన పడిన వారికి నిమ్మ మంచి ఔషధం.
- నిమ్మరసం తాగడం వల్ల ఎక్కువ సమయం పాటు ఆకలి వేయదు. దీంతో బరువు తగ్గాలని అనుకునే వారికి మంచి ఆప్షన్.
- ఫ్రీరాడికల్స్ నుంచి మన శరీర కణాలను రక్షించడంలో యాంటీ ఆక్సిడెంట్లు కీలక పాత్ర పోషిస్తాయి. కణాలను ఫ్రీ రాడికల్స్ దెబ్బతీసినప్పుడు గుండె జబ్బులు, మధుమేహం, కేన్సర్ మహమ్మారి బారిన పడే ప్రమాదం ఉంటుంది.
- నిమ్మలో పుష్కలంగా ఉండే విటమిన్ సీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తెల్ల రక్తకణాలను పెంచుతుంది. ఇవి వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడతాయి. శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ తగ్గడానికి, గాయాలు మానడానికి కూడా విటమిన్ సీ తోడ్పడుతుంది.