BJP: కర్ణాటక రాజకీయాల్లో సంచలనం

Karnataka Ex Chief Minister Resigns From Assembly and Says Will Quit BJP Too

  • ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసిన జగదీశ్ షెట్టర్
  • స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డేకు రాజీనామా లేఖ అందజేత
  • పార్టీ నుంచి కూడా తప్పుకుంటానని ప్రకటించిన మాజీ సీఎం
  • వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతోనే నిర్ణయం

కర్ణాటక రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉత్తర కన్నడ జిల్లాలోని సిర్సికి వెళ్లి స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డేను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నట్లు జగదీశ్ షెట్టర్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. వచ్చే నెలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

జగదీశ్ షెట్టర్ హుబ్బళి-ధార్వాడ్ నియోజకవర్గానికి బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేయకుండా బీజేపీ తనను అడ్డుకుంటోందని, టికెట్ కేటాయించకపోవడంతోనే తన పదవికి రాజీనామా చేసినట్లు షెట్టర్ తెలిపారు. పార్టీ నుంచి కూడా వైదొలుగుతానని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటకలో బీజేపీని అభివృద్ధి చేసిన తనను చివరకు పార్టీ నుంచి అవమానకరంగా తప్పుకునే పరిస్థితి కల్పించారని షెట్టర్ మండిపడ్డారు. పార్టీలో కొంతమంది నేతలు తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని, పార్టీ నుంచి తనను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని షెట్టర్ ఆరోపించారు.

ఉత్తర కర్ణాటకలో అత్యంత ప్రభావవంతమైన నేతగా షెట్టర్ కు పేరుంది. లింగాయత్ కమ్యూనిటీలో ఆయనకు చాలా పట్టుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, వచ్చే ఎన్నికలలో పార్టీ తరఫున సీనియర్లను కాదని కొత్త వారికి బీజేపీ అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు ప్రకటించిన 212 మంది పార్టీ అభ్యర్థుల జాబితాలో 50 మంది కొత్త వారే. ఈ క్రమంలోనే సీనియర్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలను పార్టీ పక్కనపెట్టింది.

కొత్త వారికి ముఖ్యంగా యువతకు అవకాశం కల్పించే ఉద్దేశంతోనే బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదే విషయమై ఈ నెల 11న పార్టీ పెద్దలు షెట్టర్ కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఏది ఏమైనా సరే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని షెట్టర్ తేల్చిచెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో షెట్టర్ ను బుజ్జగించేందుకు కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, ధర్మేంద్ర ప్రధాన్ లతో పాటు సీఎం బసవరాజు బొమ్మైలను బీజేపీ పెద్దలు రంగంలోకి దింపారు. శనివారం షెట్టర్ ను కలిసిన ప్రహ్లాద్ చాలాసేపు చర్చలు జరిపారు. హైకమాండ్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇంతలోనే షెట్టర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం గమనార్హం!

  • Loading...

More Telugu News