Virender Sehwag: ఢిల్లీ ఓటమికి బాధ్యత పాంటింగ్ దే: సెహ్వాగ్
- విజయాల ఘనతను తీసుకున్నప్పుడు ఓటమికీ బాధ్యత వహించాల్సిందే
- ఢిల్లీ జట్టు హెడ్ కోచ్ పాంటింగ్ పై సెహ్వాగ్ విమర్శలు
- టీమిండియా మాదిరి కుదరదంటూ చురకలు
ఐపీఎల్ 2023 సీజన్ ఢిల్లీకి కలసి రావడం లేదు. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ లు ఆడగా.. అన్నింటిలోనూ పరాజయాన్నే చవిచూసింది. సీజన్ కు ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ గాయపడడం తెలిసిందే. దీంతో అతడు ఈ సీజన్ మొత్తానికి ఐపీఎల్ కు దూరం కావాల్సి వచ్చింది. మరో దారి లేక కెప్టెన్సీ బాధ్యతలను అత్యంత సీనియర్ అయిన డేవిడ్ వార్నర్ కు డీసీ యాజమాన్యం కట్టబెట్టింది. గతంలో సన్ రైజర్స్ ను నడిపించిన అనుభవం ఉన్న వార్నర్.. ఎందుకోగానీ ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క విజయాన్ని కూడా ఢిల్లీకి అందించలేకపోయాడు.
ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఢిల్లీ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ పై విమర్శలు కురిపించాడు. ‘‘జట్టు విజయాలు సాధించినప్పుడు ఆ ఘనత కోచ్ లకు వెళుతుంది. అలాగే, జట్టు ఓటములు పాలైనప్పుడు వారే బాధ్యత వహించాలి. పాంటింగ్ తన బాధ్యతలను గొప్పగా నిర్వహిస్తున్నాడంటూ మేమే ఎన్నో సార్లు ప్రశంసించాం. ఢిల్లీ జట్టును ఫైనల్స్ కు తీసుకెళ్లాడని, ప్రతీ సీజన్ లోనూ ప్లే ఆఫ్స్ కు చేరుకుంటోందని పొగిడాం. వీటన్నింటినీ అతడు స్వీకరించాడు. కనుక ఇప్పుడు ఈ విమర్శలను కూడా తీసుకోవాలి.
విజయాలకు క్రెడిట్ తీసుకుని, ఓటములకు ఎవరినో బాధ్యులను చేసినట్టుగా ఇది భారత జట్టు కాదు. తమ అదృష్టాన్ని మార్చుకునేందుకు ఏమి చేయాలో తెలియని స్థితికి ఢిల్లీ జట్టు చేరుకుందని నేను భావిస్తున్నాను’’అంటూ సెహ్వాగ్ విమర్శలు కురిపించాడు. ఆస్ట్రేలియా జట్టుకు సైతం గతంలో కెప్టెన్ గా పనిచేసిన వార్నర్ నుంచి ఈ విధమైన ఫలితాన్ని ఢిల్లీ జట్టు సైతం ఊహించి ఉండదు. 2013 ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా ఆరు ఓటములు చూసింది. ఆ తర్వాత మళ్లీ అత్యంత విఫల చరిత్ర ఈ సీజన్ లోనే ఎదుర్కొంటోంది.