YS Avinash Reddy: హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాశ్ రెడ్డి
- వివేకా హత్య కేసులో ఈ మధ్యాహ్నం సీబీఐ విచారణకు హాజరవుతున్న అవినాశ్
- నిన్ననే అవినాశ్ తండ్రిని అరెస్ట్ చేసిన సీబీఐ
- ముందస్తు బెయిల్ కోసం లంచ్ మోషన్ పిటిషన్ వేసిన అవినాశ్
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణకు వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఈరోజు హాజరవుతున్నారు. ఈ తెల్లవారుజామున ఆయన తన అనుచరులతో కలసి 10 కార్లలో పులివెందుల నుంచి హైదరాబాద్ కు బయల్దేరారు. ఇప్పటికే ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ ను విధించడంతో పోలీసులు ఆయనను హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలుకు తరలించారు.
మరోవైపు, ఈరోజు సీబీఐ విచారణకు అవినాశ్ హాజరుకానుండటంతో ఉత్కంఠ నెలకొంది. అవినాశ్ ను కూడా అరెస్ట్ చేస్తారా? అనే సందేహాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో, తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను అవినాశ్ వేశారు. చీఫ్ జస్టిస్ బెంచ్ లో అవినాశ్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మధ్యాహ్నం 2.30 గంటలకు అవినాశ్ విచారణ ఉండగా.. దానికి అరగంట ముందు ఈ పిటిషన్ ను హైకోర్టు విచారించే అవకాశం ఉంది. కేసుకు సంబంధించిన వివరాలను తమ ముందు ఉంచాలని అవి ధర్మాసనం కోరింది.