Pinnelli Ramakrishna Reddy: వివేకా హత్యలో దోషులు ఎవరున్నా శిక్షించాల్సిందే: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
- వివేకా హత్యని రాజకీయం చేయడం బాధాకరమన్న పిన్నెల్లి
- దర్యాప్తు జరుగుతుండగానే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శ
- చంద్రబాబుకి వయసైపోయిందని ఎద్దేవా
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పరిణామాలపై మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యలో దోషులు ఎవరు ఉన్నా శిక్షించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే వివేకా హత్యని రాజకీయం చేయడం బాధాకరమన్నారు. కేసుపై సీబీఐ దర్యాప్తు జరుగుతుండగానే.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు.
మరోవైపు చంద్రబాబుకి వయసైపోయిందని, జ్ఞాపక శక్తి తగ్గిందని పిన్నెల్లి ఎద్దేవా చేశారు. చంద్రబాబు కారణంగానే రాష్ట్రానికి రాజధాని సమస్య వచ్చిందని విమర్శించారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేశ్ తోకలు కట్ చేస్తామని అన్నారు.
పల్నాడులో రాజకీయాలు ఎప్పుడూ హీట్ గానే ఉంటాయని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో పల్నాడులోని 7 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 2024లో తిరిగి వైసీపీదే అధికారమన్నారు.