Karnataka: తన ఆస్తిని రూ. 1,609 కోట్లుగా ప్రకటించిన కర్ణాటక మంత్రి.. చదివింది తొమ్మిదో తరగతే!
- 2018లో తన ఆస్తులను రూ. 1,120 కోట్లుగా ప్రకటించిన నాగరాజు
- ఈ ఐదేళ్లలో ఆస్తుల్లో రూ. 500 కోట్ల వృద్ధి
- ఈ ఎన్నికల్లో హొసకోటె నియోజకవర్గం నుంచి బరిలోకి
వచ్చే నెలలో జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో హొసకోటె నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి ఎంటీబీ నాగరాజు తన ఆస్తులను ప్రకటించారు. నిన్న నామినేషన్ దాఖలు చేసిన ఆయన తన అఫిడవిట్‌లో కళ్లు చెదిరే ఆస్తులను ప్రకటించారు. తొమ్మిదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న నాగరాజు తనకు రూ. 1,609 కోట్ల ఆస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇందులో తన భార్య పేరిట రూ. 536 కోట్ల చరాస్తులు, రూ. 1,073 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్టు తెలిపారు. అలాగే, ఇద్దరికీ కలిపి రూ. 98.36 కోట్ల రుణాలున్నట్టు పేర్కొన్నారు. నాగరాజుకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది.
2018 విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించిన నాగరాజు అప్పట్లో ఆయన ఆస్తిని రూ. 1,120 కోట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు కూలిపోవడంతో బీజేపీ అధికారాన్ని చేపట్టింది. ఈ క్రమంలో రాజీనామా చేసిన 17 మంది ఎమ్మెల్యేలలో నాగరాజు కూడా ఉన్నారు.
ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన 2020 ఉప ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తులను రూ. 1,220 కోట్లుగా ప్రకటించారు. అయితే, ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత విధాన పరిషత్తుకు ఎన్నికై మంత్రి అయ్యారు. తాజాగా ఆయన హొసకోటె నుంచి బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించారు. 2018తో పోలిస్తే ఈ ఐదేళ్లలో ఆయన ఆస్తులు రూ. 500 కోట్లు పెరిగాయి.