Syria: సిరియాలో అమెరికా హెలికాప్టర్ దాడి.. ఇస్లామిక్ స్టేట్ సీనియర్ నేత హతం
- ఉత్తర సిరియాలో అమెరికా హెలికాప్టర్ దాడి
- మధ్యప్రాచ్యం, యూరప్‌లలో దాడులకు పన్నాగం పన్నిన ఉగ్రవాది హతం
- మరో ఇద్దరు సాయుధులు కూడా హతమయ్యారన్న పెంటగాన్
ఉత్తర సిరియాలో అమెరికా హెలికాప్టర్ జరిపిన దాడిలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) సీనియర్ నేత హతమయ్యాడు. మధ్యప్రాచ్యం, యూరప్‌లలో దాడులకు ప్రణాళిక రచించిన ఐసిస్ నేతను హతమార్చినట్టు పెంటగాన్ తెలిపింది. అబ్డ్ అల్ హదీ మహమూద్ అల్ హజీ అలీ లక్ష్యంగా హెలికాప్టర్‌తో దాడిచేసినట్టు పేర్కొంది. విదేశీ అధికారులను కిడ్నాప్ చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ప్లాన్ చేసిందన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో ఈ దాడి చేసినట్టు తెలిపింది.
ఇస్లామిక్ స్టేట్ ప్రభావం ప్రస్తుతం అంతంతమాత్రమే అయినప్పటికీ మధ్య ప్రాచ్యానికి ఆవల దాడులు చేయాలన్న కోరికతో ఈ ప్రాంతంలో అది కార్యకలాపాలను నిర్వహించగలదని యూఎస్ సెంట్రల్ కమాండ్(సెంట్‌కామ్) హెడ్ జనరల్ మైఖేల్ కురిల్లా తెలిపారు. ఈ దాడిలో మరో ఇద్దరు సాయుధులు కూడా మరణించారని, సామాన్య పౌరులకు ఎలాంటి హానీ జరగలేదని పేర్కొన్నారు.
రెండు వారాల క్రితం అమెరికా బలగాల దాడిలో ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన మరో సీనియర్ నేత ఖాలిద్ అయద్ అహ్మద్అల్ జబౌరి హతమయ్యాడు. యూరప్, టర్కీలో దాడులకు అతడు ప్లాన్ చేసినట్టు సెంట్‌కామ్ తెలిపింది.
2014లో ఇరాక్, సిరియాల్లో ఇస్లామిక్ స్టేట్ ప్రభావం తీవ్రంగా ఉండేది. అప్పట్లో ఈ రెండు దేశాల్లోని మూడింట ఒకవంతు భూభాగం దాని అధీనంలోనే ఉండేది. అయితే, ఆ తర్వాత రెండు దేశాల్లో అది క్రమంగా పతనమవుతూ వచ్చింది. అయినప్పటికీ ఇస్లామిక్ ఉగ్రవాదులు మాత్రం ఇప్పటికీ దాడులు కొనసాగిస్తున్నారు.