Guntur District: చనిపోయిన టీచర్ కు పది మూల్యాంకనం డ్యూటీ.. గుంటూరు డీఈవో ఆర్డర్
- గుంటూరులో జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్వాకం
- ఆర్డర్ కాపీ చూసి విస్తుపోయిన మిగతా టీచర్లు
- కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన పాఠశాల కమిటీ చైర్మన్
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పూర్తయ్యాయి.. బుధవారం (ఈ నెల 19) నుంచి స్పాట్ వాల్యుయేషన్ మొదలవుతోంది. ఈ క్రమంలో పేపర్ మూల్యాంకనం కోసం హైస్కూలు టీచర్లకు విధులు అప్పగిస్తున్నారు. అయితే, గుంటూరు జిల్లా విద్యాధికారి కార్యాలయం మాత్రం చనిపోయిన టీచర్ కు కూడా వాల్యుయేషన్ డ్యూటీ వేసింది. ఆర్డర్ కాపీ స్కూలుకు చేరడంతో మిగతా టీచర్లంతా విస్తుపోయారు.
తెనాలిలోని ఎన్‌ఎస్‌ఎస్‌ఎం హైస్కూల్ టీచర్ గుడ్డేటి నాగయ్య అనారోగ్యంతో ఏడెనిమిది నెలలుగా విధులకు హాజరు కాలేదు. ఆరు నెలల క్రితమే కన్నుమూశారు. ఈ విషయం పరిగణనలోకి తీసుకోకుండా విద్యాశాఖ అధికారి కార్యాలయ సిబ్బంది నాగయ్యకు పదో తరగతి పేపర్ వాల్యుయేషన్ డ్యూటీ వేశారు.
నగరంలోని స్టాల్ బాలికల ఉన్నత పాఠశాలలో విధులకు హాజరు కావాలంటూ డీఈవో సంతకంతో ఆర్డర్ కాపీ పాఠశాలకు చేరింది. ఇది చూసిన టీచర్లంతా ఆశ్చర్యపోయారు. పాఠశాల కమిటీ చైర్మన్ ఎం.రాజు దీనిపై కలెక్టరేట్ లో జేసీ రాజకుమారి గణియాకు ఫిర్యాదు చేశారు.