Bournvita: బోర్నవిటాలో ఉన్న ఇంగ్రేడియంట్స్ పై వివాదం
- అధిక స్థాయిలో చక్కెర, కొకోవా ఉన్నాయన్న సోషల్ మీడియా ప్రభావశీలి
- కేన్సర్ కు దారితీసే కలరెంట్ కూడా ఉన్నట్టు లోగడ ఆరోపణ
- ఖండించిన మోండెలెజ్ ఇండియా
- లీగల్ నోటీసు పంపడంతో ప్లేట్ ఫిరాయించిన రేవంత్ హిమత్ సింగా
పోషకాల పానీయం (హెల్త్ డ్రింక్) బోర్నవిటాపై వివాదం ఏర్పడింది. సోషల్ మీడియా ప్రభావశీలి అయిన రేవంత్ హిమత్ సింగా బోర్నవిటాలో ఉన్న ఇంగ్రేడియంట్స్ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తాయని, చక్కెర పరిమాణం అధిక స్థాయిలో ఉందంటూ సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేయడంతో, దీనిపై బోర్నవిటా తయారీ సంస్థ మోండెలెజ్ ఇండియా స్పందించింది. రేవంత్ ఆరోపణలను ఖండించింది. అశాస్త్రీయ ఆరోపణలుగా పేర్కొంది. వాస్తవాలను వక్రీకరించి, ప్రతికూల అభిప్రాయాలు కలిగేలా చేసినట్టు పేర్కొంది.
మోండెలెజ్ ఇండియా లీగల్ నోటీసు కూడా పంపించింది. దీంతో సదరు వీడియోని రేవంత్ హిమత్ సింగా ఉపసంహరించుకున్నారు. మోండెలెజ్ ‘తయ్యారి జీత్ కీ’అనే ట్యాగ్ లైన్ వాడుతుండగా.. దీన్ని ‘తయ్యారి డయాబెటిస్ కీ’ అని మార్చుకోవాలంటూ రేవంత్ లోగడ వ్యాఖ్యానించారు. భారత్ లో గడిచిన ఏడు దశాబ్దాల కాలంలో శాస్త్రీయమైన ఫార్ములా, నాణ్యతా ప్రమాణాలతో రూపొందించిన బోర్నవిటా ఉత్పత్తి ద్వారా వినియోగదారుల విశ్వాసాన్ని తాము పొందామని, చట్టపరమైన నిబంధనలను అనుసరించామని మోండెలెజ్ ఇండియా ప్రకటించింది.
పోషకాహార నిపుణులు, ఆహార శాస్త్రవేత్తలతో కూడిన బృందం శాస్త్రీయంగా రూపొందించిన మంచి రుచి, ఆరోగ్యకరమైన ఉత్పత్తి ఇది అంటూ మోండెలెజ్ స్పష్టం చేసింది. తాము చెప్పేవన్నీ పారదర్శకమేనని, బోర్నవిటా తయారీలో ఉపయోగించిన పదార్థాలన్నీ కూడా నియంత్రణ సంస్థ అనుమతించినవేనని స్పష్టం చేసింది. ప్యాక్ పై పోషకాలకు సంబంధించి అన్ని వివరాలు అందించామని పేర్కొంది. తప్పుడు సమాచారం వ్యాప్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కంపెనీ ప్రతినిధి తెలిపారు. తమ వినియోగదారుల ఆందోళనలు తొలగించేందుకు, వాస్తవ సమాచారంతోపాటు వివరణతో కూడిన ప్రకటన విడుదల చేస్తున్నట్టు పేర్కొంది.
బోర్నవిటా ఉత్పత్తి నాణ్యతను ప్రశ్నిస్తూ రేవంత్ పెట్టిన ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ కి 1.2 కోట్లకు పైగా వ్యూస్ రావడం గమనార్హం. పలువురు సెలబ్రిటీలు సైతం దాన్ని షేర్ చేశారు. రేవంత్ హిమత్ సింగా తనను తాను న్యూట్రిషనిస్ట్, హెల్త్ కోచ్ గా పరిచయం చేసుకున్నారు. బోర్నవిటాలో చక్కెర, కొకోవా సాలిడ్స్ తోపాటు కేన్సర్ కు కారణమయ్యే కలరెంట్ కూడా ఉన్నట్టు ఆరోపించారు. కానీ, మోండెలెజ్ తరఫున ఓ పెద్ద న్యాయ సేవల సంస్థ నుంచి లీగల్ నోటీసు రావడంతో రేవంత్ ప్లేటు ఫిరాయించారు. లీగల్ నోటీసు వచ్చినందున తన వీడియోని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించి, మోండెలెజ్ సంస్థకు క్షమాపణలు చెబుతూ పోస్ట్ పెట్టారు. దయచేసి తనపై న్యాయపరమైన చర్యలు తీసుకోవద్దని కంపెనీని అభ్యర్థించారు. తన మాటలపై నిలబడడం చేతకానప్పుడు రేవంత్.. ఈ రాద్దాంతం అంతా ఎందుకు సృష్టించినట్టు..? దీనికి బోర్నవిటా వినియోగదారులే సమాధానం వెతుక్కోవాలేమో.!