Ajit Pawar joining hands with BJP: మహారాష్ట్రలో మరో పార్టీలో చీలిక రాబోతోందా?.. బీజేపీలోకి అజిత్ పవార్ వెళ్తున్నారని ఊహాగానాలు.. ఖండించిన శరద్ పవార్!

Over 30 Oppn MLAs in support of NCPs Ajit Pawar joining hands with BJP says Sources
  • 30 మందికి పైగా ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ బీజేపీలోకి వెళ్తున్నారంటూ వార్తలు 
  • ఆయనకు పార్టీలో కీలక నేతల మద్దతు ఉందని ప్రచారం
  • అజిత్ ఏ నిర్ణయం తీసుకున్నా వెంట ఉంటామని చెబుతున్న కొందరు ఎమ్మెల్యేలు
  • అవన్నీ పుకార్లేనన్న శరద్ పవార్.. ఎన్నికల పనుల్లో అజిత్ బిజీగా ఉన్నారని వెల్లడి
ఏడాది కిందట మహారాష్ట్రలో సంచలనం నమోదైంది. శివసేన పార్టీ రెండుగా చీలిపోయింది. ఆ పార్టీ నుంచి తన వర్గంతో బయటికి వచ్చిన ఏక్ నాథ్ షిండే.. శివసేన - ఎన్సీపీ - కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమయ్యారు. తర్వాత జరిగిన పరిణామాలతో ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో మరో పార్టీలో చీలిక రానుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 

మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)కి చెందిన అజిత్ పవార్.. 30 మందికి పైగా ఎమ్మెల్యేలతో వెళ్లి బీజేపీతో చేతులు కలపబోతున్నారని, ఆ పార్టీలో చేరబోతున్నారని వస్తున్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 30 నుంచి 34 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు అజిత్ పవార్ బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నారని, బీజేపీ తీర్థం తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది.

రానున్న రోజుల్లో తమ నేత అజిత్ పవార్ ఏ నిర్ణయం తీసుకున్నా తాము మద్దతు ఇస్తామని ఇద్దరు ఎమ్మెల్యేలు చెప్పడం ఈ ప్రచారానికి ఊతమిస్తోంది. పుణెలో నిర్వహించాల్సిన ఓ కార్యక్రమాన్ని అజిత్ పవార్ రద్దు చేసుకోవడం, ఇదే సమయంలో మహారాష్ట్ర బీజేపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు ఢిల్లీకి వెళ్లడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

అయితే ఎమ్మెల్యేలతో తాను భేటీ అవుతున్నానంటూ వచ్చిన వార్తలను అజిత్ పవార్ కొట్టిపారేశారు. పుణెలో కార్యక్రమం రద్దుపై స్పందిస్తూ.. తాను ఎక్కడా ఎలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోలేదని చెప్పుకొచ్చారు. 

మరోవైపు బీజేపీలోకి అజిత్ వెళ్తారంటూ వస్తున్న మీడియా కథనాలను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కొట్టిపారేశారు. ఎన్నికలకు సంబంధించిన పనుల్లో అజిత్ పవార్ బిజీగా ఉన్నారని, ఆయన పార్టీ మారుతారంటూ వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని స్పష్టం చేశారు.

అజిత్ వెంటనే బీజేపీలో చేరరని, శివసేన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి నిర్ణయం తీసుకుంటారని ఎన్సీపీకి చెందిన ఓ నేత చెప్పుకొచ్చారు. అజిత్ పవార్ కు పార్టీలో కీలక నేతల మద్దతు ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. 

అజిత్ పవార్ గతంలో కూడా ఒకసారి పార్టీలో చీలిక తెచ్చే ప్రయత్నం చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. ముఖ్యమంత్రి ఎవరు కావాలనే దానిపై నెలకొన్న పంచాయితీతో బీజేపీ, శివసేన మధ్య పొత్తు విచ్ఛిన్నమైంది. దీంతో కాంగ్రెస్ - ఎన్సీపీ - శివసేన కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై చర్చలు జరిపాయి. ఇదిలా ఉండగానే అజిత్ పవార్ రాత్రికి రాత్రే బీజేపీతో చేయి కలిపారు. ఉదయాన్నే ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారాలు కూడా చేశారు. అయితే శరద్ పవార్ మంత్రాంగం నడపడంతో వెనక్కి వచ్చేశారు. సీఎం పదవికి మూడు రోజుల్లోనే ఫడ్నవీస్ రాజీనామా చేశారు.
Ajit Pawar joining hands with BJP
Ajit Pawar
Sharad Pawar
NCP
BJP

More Telugu News