cannabis: గంజాయి సాగును అనుమతిద్దామా..?: పరిశీలిస్తున్న హిమాచల్ ప్రదేశ్
- నియంత్రించలేనప్పుడు అనుమతిస్తే మంచిదన్న అభిప్రాయం
- ఈ అంశాన్ని నిపుణుల కమిటీకి అప్పగించిన రాష్ట్ర సర్కారు
- కొన్ని రాష్ట్రాల్లో సాగును చట్టబద్ధం చేసిన కేంద్రం
గంజాయి అనేది ఓ మత్తు పదార్థం. నిషేధిత మత్తు పదార్థాల జాబితాలోనిది. దీన్నే కేనాబిస్ అని కూడా అంటారు. ఇప్పుడు గంజాయి సాగును రాష్ట్రంలో అనుమతించాలా? అన్నది హిమాచల్ ప్రదేశ్ పరిశీలించనుంది. చట్టప్రకారం నిషేధం ఉన్నా, అక్రమంగా సాగవుతూనే ఉంది. దీంతో దీన్ని చట్టబద్ధం చేయడం వల్ల ఆదాయం పెంచుకోవచ్చన్నది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సర్కారు భావిస్తోంది.
దీనిపై ముఖ్యమంత్రి సుఖ్ వీందర్ సింగ్ సుఖు మాట్లాడుతూ.. గంజాయి సాగును చట్టబద్ధం చేసే అంశాన్ని నిపుణుల కమిటీ పరిశీలిస్తుందని ప్రకటించారు. గంజాయిని ఔషధాల తయారీతోపాటు, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగిస్తుండడం తెలిసిందే. ప్రభుత్వం నియమించిన కమిటీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఓ నిర్ణయానికి రానుంది. ‘‘కేనాబిస్ ఆకులు, విత్తనాల వినియోగానికి సంబంధించిన సమాచారం ఆధారంగా మన చట్టం ఉంటుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికే దీని సాగును కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధం చేసింది’’ అని సుఖు చెప్పారు.