health drinks: హార్లిక్స్, బూస్ట్, బోర్నవిటా.. పిల్లలకు ఇవ్వడం మంచిదేనా?
- వీటిల్లో చక్కెర పరిమాణం ఎక్కువే
- పోషకాల లేమితో బాధపడే పిల్లలకే ఇవ్వొచ్చు
- అందరికీ వీటిని ఇవ్వడం సరికాదంటున్న డాక్టర్లు
- బరువు పెరగడం, దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు ఉంటుందని హెచ్చరిక
హార్లిక్స్, బూస్ట్, బోర్నవిటా, కాంప్లాన్ ఇవన్నీ హెల్త్ డ్రింక్స్. ఇలాంటి హెల్త్ డ్రింక్స్ బ్రాండ్లు చిన్నా, పెద్దా కలసి మార్కెట్లో వందల సంఖ్యలో ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. చాక్లెట్ ఫ్లావర్, పాలతో కలుపుకుంటే మంచి రుచి.. దీంతో పిల్లలు వీటిని తాగేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. దాంతో అమ్మల పని కూడా సులువు అవుతుంది. అందుకే ఈ హెల్త్ డ్రింక్స్ మార్కెట్ గణనీయంగా పెరుగుతోంది. మరి నిజానికి ఇవి ఆరోగ్యాన్నిచ్చేవేనా? చిన్నారుల గ్రోత్ కు ఉపయోగపడతాయా? దీనిపై నిపుణుల అభిప్రాయాలను ఓ సారి పరిశీలిద్దాం.
పౌడర్ రూపంలో హెల్త్ డ్రింక్స్ ను మన దేశంలో ఎన్నో సంస్థలు విక్రయిస్తున్నాయి. అయితే, బోర్నవిటాలో చక్కెర గణనీయంగా ఉందని, కేన్సర్ కారకం ఉందంటూ రేవంత్ హిమత్ సింగా అనే వ్యక్తి దీనిపై పెద్ద చర్చకు తావిచ్చాడు. మోండెలెజ్ కంపెనీ లీగల్ నోటీసు పంపడంతో, తన మాటలను వెనక్కి తీసుకుని, క్షమాపణలు చెప్పాడనుకోండి. అయితే, తన చర్య ద్వారా హెల్త్ డ్రింక్స్ పై ఓ సారి దృష్టి సారించేలా చేశాడు.
పోషకాలు, విటమిన్స్, మినరల్స్ ఉన్నాయంటూ కంపెనీలు సాధారణంగా వీటి విషయంలో క్లెయిమ్ చేస్తుంటాయి. వీటిని తీసుకోవడం వల్ల చిన్నారుల ఎదుగుదల బావుంటుందని, అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారని ప్రకటనలు ఇస్తుంటాయి. కానీ, ఎక్కువ ఉత్పత్తుల్లో చక్కెరలు అధిక స్థాయిలో ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. అందుకని వీటిని చిన్నారులకు ఇవ్వడం మంచిది కాదంటున్నారు.
ఈ తరహా న్యూట్రిషన్ ఉత్పత్తుల వల్ల ప్రయోజనాలతోపాటు, దుష్ఫలితాలు కూడా ఉన్నాయంటున్నారు బెంగళూరులోని ఏస్టర్ సీఎంఐ హాస్పిటల్ క్లినికల్ న్యూట్రిషన్ డైటిక్స్ హెడ్ ఎడ్వినా రాజ్. ‘‘వీటిని శక్తినిచ్చే, విటమిన్ డ్రింక్స్ గా కంపెనీలు ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ వీటిల్లో చక్కెర పరిమాణం ఎక్కువగా ఉందని అవి చెప్పవు. నిజానికి వీటిని చిన్నారులకు ఇవ్వకూడదు. ఎందుకంటే ఇవి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కిందకు వస్తాయి. వీటిని ఇవ్వడం వల్ల పిల్లలు అధిక బరువు పెరుగుతారు. దంతాల్లో పుచ్చులు వస్తాయి. దీర్ఘకాలిక జీవనశైలి వ్యాధులు కూడా రావచ్చు. వీటిని మాల్ట్, బార్లీ నుంచి తయారు చేస్తుంటారు’’ అని గురుగ్రామ్ లోని సీకే బిర్లా హాస్పిటల్ నియోనాటాలజీ కన్సల్టెంట్ డాక్టర్ సౌరభ్ కన్నా తెలిపారు.
ఎవరికి ఇవ్వాలి..?
పోషకాల లేమితో బాధపడుతున్న చిన్నారులకు ఈ హెల్త్ డ్రింక్స్ ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు తగినంత పోషకాహారం అందించలేని పరిస్థితుల్లోనే వీటిని ఇవ్వొచ్చని సూచిస్తున్నారు. కొన్నింటిలో సోయా, పీనట్స్, మాల్టోడెక్స్ట్రిన్ ఉంటున్నట్టు డాక్టర్ ఎడ్వినా రాజ్ తెలిపారు. మాల్టోడెక్స్ట్రిన్ పిల్లలు అందరికీ కాకుండా, అవసరమైన వారికే ఇవ్వాల్సి ఉంటుందన్నారు.