Virat Kohli: ఒకానొక సమయంలో బెంగళూరును వదిలిపెడదామనుకున్నా: కోహ్లీ
- తొలుత తనకు టాప్ ఆర్డర్ లో అవకాశం రాలేదన్న కోహ్లీ
- తన కోరికకు ఆర్సీబీ విలువనిచ్చిందని వ్యాఖ్య
- అవసరమైనప్పుడు ఆర్సీబీ తనపై విశ్వాసం చూపించిందన్న కోహ్లీ
ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీది విడదీయలేని సంబంధం. 2008లో ఐపీఎల్ ప్రారంభమయినప్పటి నుంచి కోహ్లీ బెంగళూరు జట్టులోనే ఉన్నాడు. ఐపీఎల్ ప్రారంభమయినప్పటి నుంచి ఒకే ఫ్రాంచైజీ తరపున ఆడుతున్న ఏకైక ఆటగాడు కోహ్లీనే కావడం గమనార్హం. ఇప్పటి వరకు బెంగళూరుకు ఒక్క ఐపీఎల్ ట్రోఫీ రాకపోయినా... విరాట్ పై ఆ జట్టు ఫ్యాన్స్ అభిమానం మాత్రం తగ్గలేదు. అయితే కోహ్లీ తాజాగా ఒక సంచలన విషయాన్ని వెల్లడించాడు. ఒకానొక దశలో తాను బెంగళూరు జట్టును వీడాలనుకున్నానని చెప్పాడు. అప్పటి వరకు తనకు టాప్ ఆర్డర్ లో అవకాశం లభించకపోవడమే దీనికి కారణమని తెలిపాడు.
బెంగళూరు జట్టుతో ప్రయాణానికి తాను ఎంతో విలువనిస్తానని కోహ్లీ చెప్పాడు. తొలి మూడు సీజన్లలో తనకు బెంగళూరు ఫ్రాంచైజీ నుంచి చాలా మద్దతు లభించిందని తెలిపాడు. ఫ్రాంచైజీలు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే సమయం వచ్చినప్పుడు... నిన్ను కొనసాగించాలనుకుంటున్నామని మేజేజ్ మెంట్ చెప్పిందని... దీనికి సమాధానంగా తాను టాప్ ఆర్డర్ లో ఆడాలనుకుంటున్నానని చెప్పానని వెల్లడించాడు. ఇండియా తరపున తాను మూడో స్థానంలో ఆడుతున్నానని, ఇక్కడ కూడా అదే స్థానంలో ఆడాలనుకుంటున్నానని చెప్పానని.. దానికి రే జెన్నింగ్స్ ఓకే చెప్పాడని తెలిపాడు. అవసరమైనప్పుడు ఆర్సీబీ తనపై విశ్వాసం చూపించిందని అన్నాడు.