London: ఇంగ్లాండ్‌లో తెలంగాణ విద్యార్థిని దుర్మరణం
- ప్రమాదవశాత్తూ సముద్రంలో మునిగి మృతి చెందిన ఖమ్మం జిల్లా యువతి సాయి తేజస్విని
- ఏప్రిల్ 11న జరిగిన దుర్ఘటన
- మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సాయపడాలంటూ ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి
- తప్పకుండా సాయం చేస్తామంటూ మంత్రి స్పందన
ఇంగ్లండ్‌లో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థిని కే. సాయితేజస్విని రెడ్డి అనూహ్య పరిస్థితుల్లో దుర్మరణం చెందారు. ఏప్రిల్ 11న లండన్‌లోని బ్రైటన్ బీచ్‌లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఆమె ప్రమాదవశాత్తూ సముద్రంలో మునిగిపోయి మృతి చెందారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తేజస్విని స్వస్థలం ఖమ్మం జిల్లా. ఆమె తల్లిదండ్రులు కే.శశిధర్ రెడ్డి, జ్యోతి హైదరాబాద్ ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వారికి తేజశ్విని ఒక్కరే సంతానం. యూకేలోని క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీలో ఆమె ఏరో నాటిక్స్, స్పేస్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. కాగా, తేజస్విని మరణంతో ఆ దంపతులు శోకసంద్రంలో కూరుకుపోయారు.
తేజస్విని మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు సాయపడాలంటూ శశిధర్ రెడ్డి దంపతులు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. దీనిపై తక్షణం స్పందించిన మంత్రి సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ‘‘మీకు జరిగిన నష్టానికి చాలా చింతిస్తున్నాం. నా టీమ్ బ్రిటీష్ డిప్యూటీ హైకమిషన్‌ను సంప్రదించి వెంటనే సహాయం చేస్తుంది’’ అని ట్వీట్ చేశారు.