Kanakamedala Ravindra Kumar: ఫ్యాక్షనిస్టుకు అధికారం తోడైంది.. ఏపీలో పురుషుడు కూడా అర్ధరాత్రి స్వతంత్రంగా తిరగలేడు: టీడీపీ ఎంపీ కనకమేడల
- విభజన కంటే జగన్ సీఎం అయ్యాకే ఏపీ ఎక్కువ నష్టపోయిందన్న కనకమేడల
- అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని.. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శలు
- వివేకా హత్య వెనుక ఎవరు ఉన్నారనేది ఏపీ ప్రజలు గ్రహించారని వ్యాఖ్య
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఏప్రిల్ 20 తమకు పండుగ రోజన్నారు. చంద్రబాబు న్యాయకత్వంలో మరోసారి ఏపీలో అధికారంలోకి రాబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా నష్టపోయాం. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక అమరావతి నిర్మాణం చేపట్టారు. రాజధాని కోసం దాదాపు 40 వేల ఎకరాల మేర భూములు సేకరించి అమరావతి అభివృద్ధికి చంద్రబాబు నాంది పలికారు’’ అని అన్నారు.
జగన్ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని.. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కనకమేడల తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఏపీలో పురుషుడు కూడా అర్ధరాత్రి స్వతంత్రంగా తిరగలేని పరిస్థితులు ఉన్నాయని, శాంతి భద్రతలు లేవని, ఒక ఫ్యాక్షనిస్టుకు అధికారం తోడైందని మండిపడ్డారు. విభజన కంటే జగన్ సీఎం అయిన తర్వాత ఏపీ మరింత నష్టపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్ దివాలా తీసిందన్నారు.
‘‘2019లో జరిగిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను చంద్రబాబుకు ఆపాదించాలని జగన్ చూశారు. అధికారంలోకి రాకముందు జగన్ సీబీఐ విచారణ కావాలని కోరారు.. అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ విచారణ అవసరం లేదని, ప్రభుత్వమే విచారణ చేస్తుందని చెప్పారు’’ అని మండిపడ్డారు. జగన్ మాటలపై నమ్మకం లేక.. సునీత రెడ్డి సీబీఐ విచారణ కావాలని కోరారని చెప్పారు.
న్యాయ ప్రక్రియను ముఖ్యమంత్రి అడ్డుకొని దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఎంపీ కనకమేడల ఆరోపించారు. వివేకానంద రెడ్డి హత్య వెనుక ఎవరు ఉన్నారనేది ఏపీ ప్రజలు గ్రహించారన్నారు. వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ఉద్యోగులకు సమయానికి జీతాలు, పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని కనకమేడల ఆందోళన వ్యక్తం చేశారు.