gautam adani: హిండెన్ బర్గ్ వివాదం... శరద్ పవార్ నివాసానికి వెళ్లిన అదానీ
- ముంబైలో ఎన్సీపీ అధినేత నివాసంలో సమావేశం
- దాదాపు రెండు గంటల పాటు భేటీ
- అదానీ ఘటనపై జేపీసీ ఏర్పాటు చేస్తే ఓకే అన్న పవార్
- కమిటీలో బీజేపీదే ప్రాబల్యం ఉంటుందని వెల్లడి
- సరైన ప్రాతినిధ్యం లేకుండా విపక్షాలు ఏంచేయగలవని వ్యాఖ్యలు
హిండెన్ బర్గ్ - అదానీ వివాదంపై విచారణకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న తరుణంలో బిలియనీర్ గౌతమ్ అదానీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ముంబైలో భేటీ అయ్యారు. పవార్ నివాసంలో ఇద్దరూ దాదాపు రెండు గంటల పాటు సమావేశమయ్యారు. అదానీపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సుప్రీం కోర్టు పర్యవేక్షణలోని బృందంతో విచారణ చేయించాలంటూ పవార్ గత వారం డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ నుండి ఇటీవల వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వీరి సమావేశం జరిగింది.
అదానీ ఘటనకు సంబంధించి విచారణ జరగాలని తాను కూడా కోరుతున్నానని తెలిపారు. పార్లమెంటులో రాజకీయ పార్టీల బలం ఆధారంగా ఒక జేపీసీ ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. అప్పుడు 21 మంది సభ్యుల జేపీసీ ఏర్పడితే 200 మందికి పైగా ఎంపీలు ఉన్నందున 14-15 మంది బీజేపీ నుండి ఉంటారని వివరించారు.
అప్పుడు ప్రతిపక్షం నుండి ఆ కమిటీలో ఆరేడుగురు మాత్రమే ఉంటారని, ఈ ఆరేడుగురు వ్యక్తులు బీజేపీ ప్రాబల్యం ఉన్న ఆ కమిటీలో ఎంత సమర్థవంతంగా పని చేయగలరని పవార్ ప్రశ్నించారు. అయితే ప్రతిపక్ష పార్టీలు జేపీసీ వేయాలని కోరుకుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.