CBI: ఈ రోజు అవినాశ్ రెడ్డిని 8 గంటల పాటు విచారించిన సీబీఐ
- రెండో రోజు విచారణకు హాజరైన కడప ఎంపీ
- వైఎస్ భాస్కరరెడ్డిని కూడా విచారించిన సీబీఐ
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డిని సీబీఐ రెండో రోజైన గురువారం విచారించింది. ఎనిమిది గంటల పాటు ఆయనను విచారించారు. అవినాశ్ రెడ్డితో పాటు ఉదయ్, వైఎస్ భాస్కరరెడ్డిని కూడా సీబీఐ ప్రశ్నించింది. ఈ హత్య కేసులో సీబీఐ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం ఇరువైపుల వాదనలు విని తుది తీర్పును 25వ తేదీకి వాయిదా వేసింది.
అయితే ఆ లోపు అంటే 25వ తేదీ వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని కోర్టు సీబీఐని ఆదేశించింది. అదే సమయంలో అవినాశ్ రెడ్డి ఆ రోజు వరకు ప్రతిరోజు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అవినాశ్ రెడ్డి నేడు వరుసగా రెండో రోజు విచారణకు హాజరయ్యారు. ముందస్తు బెయిల్ పైన 25వ తేదీన తుది తీర్పు వెలువరించనుంది.