Jammu And Kashmir: పూంచ్ దాడి మా పనే: ప్రకటించిన జైషే మహ్మద్
- ఉగ్రదాడిలో అసువులు బాసిన ఐదుగురు జవాన్లు
- గ్రనేడ్ దాడి కారణంగానే వాహనంలో మంటలు
- ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో జల్లెడ పడుతున్న అధికారులు
జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో నిన్న జరిగిన ఉగ్రదాడి తమ పనేనని పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రకటించింది. ఈ ఉగ్రదాడిలో ఐదుగురు భారత జవాన్లు అసువులు బాశారు. జిల్లాలోని భీంబెర్ గాలి నుంచి సంగియోట్ వెళ్తున్న ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులతో తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు అమరులు కాగా, ఓ అధికారి గాయపడ్డారు. వెంటనే ఆయనను రాజౌరీలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న వెంటనే అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (జమ్ము) సహా సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. జిల్లాలోని రాజౌరి సెక్టార్లో నిన్న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ ఉగ్రదాడి జరిగింది. కాల్పులు జరిగిన వెంటనే వాహనంలో మంటలు చెలరేగాయి. గ్రనేడ్ దాడి కారణంగా మంటలు అంటుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు.