Karnataka: కర్ణాటక ఎన్నికల బరిలో యాచకుడు.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి యంకప్ప!
- వచ్చే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు
- భిక్షాటన ద్వారా డిపాజిట్‌కు అవసరమైన రూ. 10 వేల సేకరణ
- తానెందుకు పోటీ చేస్తున్నానో ప్రజలకు చెప్పానన్న యంకప్ప
వచ్చే నెలలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓ యాచకుడు బరిలోకి దిగుతున్నాడు. అతడి పేరు యంకప్ప. యాదగిరి పట్టణానికి చెందిన యంకప్ప భిక్షాటన ద్వారా సేకరించిన రూ. 10 వేలు డిపాజిట్‌గా చెల్లించి నిన్న నామినేషన్ దాఖలు చేశాడు. అధికారులు ఎన్నికల తేదీ ప్రకటించినప్పటి నుంచి డిపాజిట్‌కు అవసరమైన డబ్బు కోసం యంకప్ప యాదగిరి పట్టణంలో తిరుగుతూ భిక్షాటన చేశాడు. రూ. 10 వేలు సమకూరగానే ఎన్నికల కార్యాలయానికి చేరుకుని స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ సమర్పించాడు.
యంకప్ప సమర్పించిన నాణేలను లెక్కించేందుకు అధికారులకు రెండు గంటలకుపైగా సమయం పట్టింది. యంకప్ప నామినేషన్‌ను స్వీకరించినట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా యంకప్ప మాట్లాడుతూ.. తాను ఎందుకు పోటీ చేస్తున్నానో ప్రజలకు చెప్పానని, వారి నుంచే డిపాజిట్ సొమ్ము సేకరించానని పేర్కొన్నాడు. కాగా, పగలంతా భిక్షాటన చేసే యంకప్ప రాత్రుళ్లు మాత్రం ఆలయాల్లో నిద్రిస్తాడు.