India: అమెరికా ఆంక్షల ఫలితం... భారత్ కు రష్యా ఆయుధాల సరఫరాలో ప్రతిష్టంభన
- భారత్ కు సుదీర్ఘకాలంగా ఆయుధాలు విక్రయిస్తున్న రష్యా
- రష్యా నుంచి రెండు ఎస్-400 వ్యవస్థలు కొనుగోలు చేసిన భారత్
- ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర
- రష్యాతో డాలర్ వాణిజ్యంపై అమెరికా కఠిన ఆంక్షలు
- రష్యాకు ఎలా చెల్లించాలన్నది అనిశ్చితిగా మారిన వైనం
- భారత్ కు అందని ఎస్-400 వ్యవస్థలు
భారత్ కు అతి పెద్ద ఆయుధ సరఫరాదారు రష్యా అని తెలిసిందే. భారత్ తన రక్షణ రంగ అవసరాల కోసం అత్యధిక శాతం రష్యాపైనే ఆధారపడుతోంది. ఇటీవల పలు ఆయుధాల తయారీలో భారత్ స్వావలంబన సాధించినప్పటికీ, కీలక అస్త్రాలను రష్యానుంచే కొనుగోలు చేస్తోంది. వాటిలో ఎస్-400 క్షిపణి నిరోధక వ్యవస్థ ప్రధానమైనది.
ఈ మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థ కలిగివుంటే... మన దేశ గగనతలంలోకి దూసుకొచ్చే క్షిపణులను, యుద్ధ విమానాలను గాల్లోనే అడ్డుకునే వీలుంటుంది. ప్రధానంగా, చైనా, పాకిస్థాన్ ల నుంచి పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని రెండు ఎస్-400 వ్యవస్థలను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం విలువ రూ.39 వేల కోట్లు.
అయితే, అమెరికా ఆంక్షల ఫలితంగా ఈ ఒప్పందంలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర నేపథ్యంలో, అమెరికా అత్యంత కఠిన ఆంక్షలు విధించింది. డాలర్ల రూపంలో రష్యాకు చెల్లింపులు చేయరాదన్నది ఆ ఆంక్షల్లో ఒకటి. దాంతో అమెరికా డాలర్ల రూపంలో ఈ ఒప్పందం తాలూకు మొత్తాన్ని చెల్లించడంలో భారత్ ఇబ్బంది పడుతోంది.
అదే సమయంలో రూపాయితో చెల్లింపులు చేద్దామంటే రష్యా అంగీకరించడంలేదు. రూపాయితో రూబుల్ (రష్యా కరెన్సీ) మారకం రేటు అస్థిరతలను దృష్టిలో ఉంచుకుని రష్యా వెనుకంజ వేస్తోంది.
ఆయుధ అమ్మకాల ద్వారా వచ్చే రూపాయిలను రుణ, మూలధన మార్కెట్లలో పెట్టుబడిగా పెట్టాలని రష్యాకు భారత్ ప్రతిపాదించింది. అయితే, పుతిన్ ప్రభుత్వం అందుకు కూడా మొగ్గు చూపలేదు.
ఇప్పుడు, యూరోలు, దిర్హామ్స్ కరెన్సీలు భారత్ కు ఆశాకిరణాల్లా కనిపిస్తున్నాయి. చవకగా లభిస్తున్న రష్యా క్రూడాయిల్ ను కొనుగోలు చేసేందుకు భారత్ యూరోలు, దిర్హామ్ లలోనే చెల్లింపులు చేస్తోంది. ఇప్పటికే రష్యా చమురు కొనుగోలు చేస్తుండడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అమెరికా... ఇప్పుడు ఈ కరెన్సీల సాయంతో ఆయుధాలు కొనుగోలు చేస్తే మరింత కఠిన వైఖరి అవలంబించి, మరిన్ని ఆంక్షలకు తెరలేపే అవకాశముందని భావిస్తున్నారు. దాంతో ఈ అంశంలోనూ భారత్ మల్లగుల్లాలు పడుతోంది.