NCP: సీఎం కుర్చీయే కావాలనుకుంటే ఇప్పటికిప్పుడు దక్కించుకుంటాం: ఎన్సీపీ నేత

NCP can stake claim to Maharashtra CMs post right now says Ajit Pawar
  • 2004లో ఆర్ఆర్ పాటిల్ మహారాష్ట్ర సీఎం అయ్యేవారని అజిత్ పవార్ వెల్లడి
  • ఎన్సీపీలో చీలిక రావడం అసాధ్యమని స్పష్టం చేసిన సీనియర్ నేత
  • షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వం రాత్రికి రాత్రే ఏర్పడలేదని వివరణ
  • బీజేపీలో మోదీలా ప్రజాదరణ కలిగిన నేత మరొకరు లేరన్న పవార్ 
ముఖ్యమంత్రి పీఠం కావాలనుకుంటే ఇప్పటికిప్పుడు దానిని దక్కించుకోగలమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నేత అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది మహారాష్ట్రలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం పోస్టును ఎన్సీపీ దక్కించుకుంటుందా అన్న ప్రశ్నకు పవార్ ఈ జవాబిచ్చారు. ఈమేరకు శుక్రవారం పింప్రిచించ్వాడ్ లో జరిగిన ఓ కార్యక్రమానికి అజిత్ పవార్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవే కావాలని అనుకుంటే 2004లోనే ఎన్సీపీ లీడర్ సీఎం సీట్లో కూర్చునే వారని చెప్పారు. అప్పట్లో ఎన్సీపీ మొత్తం 71 సీట్లను గెలుచుకున్న విషయాన్ని పవార్ గుర్తుచేశారు. సీఎం పోస్టు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధపడిందని చెప్పారు. అయితే, పార్టీలో క్రమశిక్షణ కోసం డిప్యూటీ సీఎం పోస్టుతో సరిపెట్టుకున్నామని వివరించారు. లేదంటే దివంగత నేత ఆర్ఆర్ పాటిల్ అప్పట్లోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేవారని అజిత్ పవార్ చెప్పారు.

ఎన్సీపీలో చీలిక ఏర్పడుతుందనే వార్తలపైనా అజిత్ పవార్ స్పందించారు. మా పార్టీలో చీలిక ఏర్పడి బీజేపీతో కలిసే అవకాశమే లేదని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామాపై మాట్లాడుతూ.. ఏక్ నాథ్ షిండే అసంతృప్తితో ఉన్నారనే విషయం తమ నేత శరద్ పవార్ కు తెలుసని వివరించారు. షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వం రాత్రికిరాత్రే ఏర్పడలేదని, దాని వెనక ఏళ్ల తరబడి సంప్రదింపులు నడిచాయని చెప్పారు. కాగా, బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం నరేంద్ర మోదీ ఛరిస్మానేనని స్పష్టం చేసిన అజిత్ పవార్.. మోదీలాగా ప్రజాదరణ కలిగిన నేత బీజేపీలో మరొకరు లేరని పవార్ వివరించారు.
NCP
Maharashtra
ajit pawar
Sharad Pawar
cm post

More Telugu News