MS Dhoni: వయసు పెరిగింది.. నా కెరీర్ చివరి చివరి దశలో ఉంది: ధోనీ
- తనకు వయసు పెరిగిందని చెప్పడానికి సిగ్గుపడనన్న ధోనీ
- ఈ ఐపీఎల్ సీజన్ లో ప్రతి మ్యాచ్ ను ఆస్వాదించేందుకు యత్నిస్తున్నానని వ్యాఖ్య
- ఈ సీజన్ లో ఎక్కువగా బ్యాటింగ్ చేసేందుకు అవకాశం రాలేదన్న ధోనీ
టీమిండియాకు కెప్టెన్ గా ధోనీ ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు. ఐపీఎల్ లో సైతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టును అత్యధిక సార్లు విజేతగా నిలిపాడు. భారత జట్టుకు ధోనీ దూరమైనప్పటికీ... ఇప్పటికీ ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. మరోవైపు ధోనీ ఐపీఎల్ కు కూడా వీడ్కోలు పలికి, ఆటగాడిగా క్రికెట్ కు దూరం కానున్నాడనే ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. దీనిపై ధోనీ క్లారిటీ ఇచ్చాడు. తన వయసు పెరిగిందని... ఈ విషయం చెప్పడానికి తాను ఏమాత్రం సిగ్గుపడనని అన్నాడు. తన కెరీర్ చివరి దశకు చేరుకున్నట్టేనని స్పష్టం చేశాడు. సచిన్ టెండూల్కర్ మాదిరి 16 ఏళ్లకే కెరీర్ ను ప్రారంభిస్తే ఆటను ఎంతో ఆస్వాదించవచ్చని చెప్పాడు.
తాను కెరీర్ చివరి దశలో ఉన్నాననే విషయం తనకు బాగా తెలుసని ధోనీ అన్నాడు. అందుకే ఈ ఐపీఎల్ సీజన్ లో ప్రతి మ్యాచ్ ను పూర్తి స్థాయిలో ఆస్వాదించేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. తనకు చెన్నై సూపర్ కింగ్స్ తో విడదీయలేని అనుబంధం ఉందని అన్నారు. సీఎస్కే అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమ, అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. ఈ సీజన్ లో తనకు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదని అన్నాడు.